
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు
రంపచోడవరం: ఏజెన్సీలో గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుశాఖ అనుమతులు తప్పనిసరిగా పొందాలని రంపచోడవరం డీఎస్పీ జి.సాయిప్రశాంత్ సృష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఉత్తర్వులు ప్రకారం మండల కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను సురక్షిత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని మతాల పెద్దలతో , వినాయక ఉత్సవ కమిటీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అనుమతి లేకుండా విగ్రహాలు, పందిళ్లు ఏర్పాటు చేయవద్దన్నారు. విగ్రహాలు వద్ద తాత్కాలిక సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజెలు ఉపయోగించవద్దన్నారు. ఈ నెల 23వ తేదీ ఎనిమిది గంటల లోగా మండపాలు ఏర్పాటు చేసుకునే వారు విధిగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటులో ట్రాఫిక్‌కు , ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకూడదన్నారు. రాత్రి పది తరువాత ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని, అశ్లీల నృత్యాలు అనుమతించబడవన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ భూషణం తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్