
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● నేలపై కూర్చున్న ఇంటర్ విద్యార్థులు
● అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్షల్లో ఈ 2025–26లో మంచి ఫలితాలు సాధించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడుతూ గతేడాది పదో తరగతి పరీక్షల్లో పాఠశాల ఉత్తీర్ణత శాతంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన విద్యా ప్రమాణాలు, విద్యాబుద్ధులు విద్యార్థులకు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
బెంచీల ఏర్పాటుకు ఆదేశం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు బెంచిలు లేకపోవడంతో నెలపై కూర్చొని విద్య అభ్యసిస్తున్న తీరును చూసిన ఎమ్మెల్యే వారికి తక్షణమే బెంచీలు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కె.భవానికి ఆదేశించారు. దీనిపై ప్రిన్సిపాల్ భవాని మాట్లాడుతూ బెంచీల విషయంపై ప్రతిపాదన పంపామని, ప్రస్తుతం నాడు–నేడు ద్వారా మంజూరైన నిధులతో భవనం పూర్తి దశలో ఉందని, త్వరలో బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి.పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, పోతంగి, గుంటసీమ, కండ్రుమ్ సర్పంచ్‌లు వంతల నాగేశ్వరరావు, గుమ్మ నాగేశ్వరరావు, కె.హరి, మండల పార్టీ కార్యదర్శి మఠం శంకర్, నాయకులు బబిత, కృష్ణ, దశమి తదితరులున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి