
విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించాలని వినతి
మంచంగిపుట్టు: మండల విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని యూటీఎఫ్ మండల శాఖ పిలుపునిచ్చింది. స్థానిక మండల యూటీఎఫ్ అధ్యక్షుడు చిట్టపులి త్రినాథం ఆధ్వర్యంలో ఎంఈవో కోడా కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ధర్మారావు మాట్లాడుతూ శిథిలావస్థలో మరియు పూర్తిగా భవనాలు లేని పాఠశాలలకు నూతన భవనాలు మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపించాలని, ఉపాధ్యాయుల సర్వీస్ సమస్యలను పరిష్కరించాలన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలన్నారు. గిరిజన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలని, పెండింగ్ బిల్స్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎం.టి.ఎస్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై ఎంఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించినట్టు వారు చెప్పారు. నేతలు త్రినాథం, గోపి, ధర్మారావు,శ్రీనివాసమూర్తి, సూర్యనారాయణ, గోవింద్, తిరుపతిరావు, రఘుమణి, ధనుపతి పాల్గొన్నారు.