
గడపగడపలో జ్వరాలు
సాక్షి,పాడేరు: మన్యంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, నీటి కాలుష్యం, పారిశుధ్య లోపం, దోమల విజృంభణ తదితర కారణాలతో గ్రామాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నారు. పాడేరులోని జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ, రంపచోడవరంలో ప్రాంతీయ ఆస్పత్రులు, చింతపల్లి, ముంచంగిపుట్టు సీహెచ్‌సీలు, 62 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటికి రోజువారీ వస్తున్న రోగుల్లో అధికంగా జ్వరం సోకిన వారే ఉంటున్నారు. వీరికి నిర్వహిస్తున్న రక్త పరీక్షల్లో వైరల్, టైఫాయిడ్, మలేరియా నిర్థారణ అవుతోంది. వీటిలో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉంటున్నాయి.
● పాడేరులోని జిల్లా సర్వజన ఆస్పత్రికి రోగుల రద్దీ అఽధికమైంది. గత పది రోజుల నుంచి ఓపీ 400 దాటుతుండడంతో రోగులతో కిటకిటలాడుతోంది. అన్ని విభాగాలకు సంబంధించి 300మంది ఇన్‌పేషెంట్లుగా వైద్యసేవలు పొందుతున్నారు. వీరిలో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మలేరియాపీడితుల వివరాలను ఆస్పత్రి వర్గాలు గోప్యంగానే ఉంచతున్నాయి. చిన్నపిల్లల వార్డులో 40మంది వరకు వైద్యసేవలు పొందుతున్నారు. వీరిలో జ్వరాలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇదే పరిస్ధితి అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, చింతపల్లి, ముంచంగిపుట్టు సీహెచ్‌సీల్లోను నెలకొంది.
● జిల్లాలోని అన్ని గ్రామాల్లోను అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయి. అధిక వర్షాలు, వాతావరణ మార్పులతో గిరిజనులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైద్యబృందాలు ఫ్యామిలీ ఫిజీషియన్ పేరుతో ఇంటింటికి సత్వర వైద్యసేవలు అందేవి. ప్రస్తుతం 104 వాహనాలు గ్రామాలను సందర్శిస్తున్నప్పటికీ ఇంటింటికి తిరగడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. దీనివల్ల గ్రామాల్లో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యసేవలు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
2892 మలేరియా కేసుల నమోదు
ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 2892 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 105 మలేరియా జ్వరపీడితులను గుర్తించి వైద్యసేవలు అందించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో గన్నెల, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో మారేడుమిల్లి, చింతూరు ఐటీడీఏ పరిధిలో మోతుగూడెం ప్రాంతాల్లో కూడా మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
మన్యంలో విజృంభణ
రోగులతో నిండిపోయిన పాడేరు జిల్లా ఆస్పత్రి
నమోదు అవుతున్న మలేరియా కేసులు
గోప్యంగా ఉంచుతున్న అధికారవర్గాలు
నామమాత్రంగా ఇంటింటికీ వైద్యం
ఇంటింటికీ వైద్య ఆరోగ్య సేవలు
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్యారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి చే శాం. ఇంటింటికి వైద్య ఆరోగ్య సేవలు కల్పిస్తున్నాం.
– డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు,
డీఎంహెచ్‌వో, పాడేరు

గడపగడపలో జ్వరాలు