
గ్రామాల అభివృద్ధికి ఆదికర్మయోగి అభియాన్
రంపచోడవరం: గిరిజన ప్రాంతంలోని గిరిజన గ్రామాల అభివృద్ది చెందే విధంగా ఆది కర్మయోగి కార్యక్రమం ద్వారా గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ విలేజ్ విజన్ మ్యాప్, విలేజ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో ఆదికర్మయోగి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు ఈ సందర్బంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఆదికర్మ యోగి కార్యక్రమాన్ని గ్రామస్తులకు వివరించాలన్నారు. సచివాలయాల పరిధిలో కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎన్‌జీవోలు ఆయా గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవాలన్నారు. వీటిని విజన్ యాక్షన్ ప్లాన్‌లో పొందుపరచాలని సూచించారు. విజన్ మ్యాప్ తయారు చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజన్ మ్యాప్ తరువాత ప్రాధాన్యత క్రమంలో గ్రామస్తులతో కలిసి విజన్ యాక్షన్ ప్లాన్ జాబితా తయారు చేసి సమర్పించాలన్నారు. 2047 నాటికి గిరిజన ప్రాంత గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే విధంగా కేంద్రం ఆదికర్మ యోగి అభియోన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
సేవతోనే ఆత్మసంతృప్తి
రంపచోడవరం: వేగంగా బంగారు కుటుంబాలను గుర్తించాలని, సేవతోనే తృప్తి, సాయం సంతృప్తిని ఇస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ నుంచి గురువారం జిల్లలోని మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్‌లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. బంగారు కుటుంబాల వివరాలపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా బంగారు కుటుంబాల వివరాలు సిద్ధం చేయాలన్నారు.మండల స్ధాయిలో మండల ప్రత్యేక అధికారి పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. మండల సచివాలయాల స్ధాయిలో పురోగతి లేదన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పనులు పురోగతి చేయాలన్నారు. రానున్న మూడు రోజుల్లో మార్గదర్శులు, బంగారు కుటుంబాలు గుర్తించాలన్నారు. ప్రాజెక్టు ఽఅధికారులు రోజు వారీగా ఎన్‌రోలైన మార్గదర్శులు, బంగారు కుటుంబాలపై సమీక్షించాలన్నారు. సచివాలయాల ద్వారా ఎన్‌రోల్‌మెంట్ వేగవంతం చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు మండలంలో అవసరమైన విద్య, వైద్యం తదితర వాటిని గుర్తించాలన్నారు. జెసీ అభిషేక్ గౌడ, ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భరత్, సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్, డీఆర్‌ఓ పద్మాలత, జిల్లా పీ4 ప్రత్యేక అధికారి లోకేశ్వరరావు, డీజీపీవో చంద్రశేఖర్ తదతరులు పాల్గొన్నారు.