
కనీస వేతనం చెల్లించాలి
అరకులోయ టౌన్: కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్, అరకు పరిసర ప్రాంతాల్లోని రైల్వే లైన్‌లో పనిచేస్తున్న ట్రాక్ నిర్వహణ కార్మికులు, శానిటేషన్ మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నర్సింహులు డిమాండ్ చేశారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో యూనియన్ కార్యదర్శి సన్యాశిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే బోర్డు జారీ చేసిన జీవో ప్రకారంగా కనీస వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐకు సంబంధించి సమస్య ఉందన్నారు. గిరిజన జాతికి చెందిన వారు కావడంతో చులకన భావంతో కాంట్రక్టర్లు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారు. చట్ట ప్రకారం చెల్లించాల్సిన వేతనంలో కోత విధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి
నర్సింహులు డిమాండ్