పరాయి దేశంలో యువకుల నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

పరాయి దేశంలో యువకుల నిర్బంధం

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

ఖతార్‌లో చిక్కుకున్న నిర్మల్‌ జిల్లావాసులు నిషేధిత ప్రాంతంలో సెల్‌ఫోన్‌ వినియోగించారనే ఆరోపణలు స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు

నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం ఖతార్‌ దేశానికి వెళ్లిన నిర్మల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అక్కడి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ కుటుంబసభ్యులను ఎలాగైనా స్వదేశానికి రప్పించేలా కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌–జి మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన కుంచెపు గణేశ్‌ (24), సోన్‌ మండలం మాదాపూర్‌కు చెందిన సంపత్‌ (25) సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరు ఆక్వా క్లిన్‌ ఫెసిలిటీస్‌ సర్వీసెస్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

నిషేధిత ప్రదేశంలో ఫోన్‌ వినియోగించారని..

ఉద్యోగ విధుల్లో భాగంగా ఉన్న సమయంలో గత ఆగస్టులో నిషేధిత పని ప్రదేశంలో సెల్‌ఫోన్‌ వినియోగించారనే కారణంతో ఖతార్‌ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని పొన్కల్‌కు చెందిన సందీప్‌ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారమందించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ బాధిత యువకులు గణేశ్‌, సంపత్‌ కుటుంబ సభ్యులు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావును శుక్రవారం కలిసి తమ ఆవేదన వివరించారు. తమ పిల్లలను భారతదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టాలని, న్యాయ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీహరిరావు స్పందిస్తూ, సమస్యను రాష్ట్రస్థాయిలో సంబంధిత ఎన్‌ఆర్‌ఐ విభాగం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ కమిటీ వైస్‌చైర్మన్‌ మంద భీమ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఇద్దరు యువకుల వివరాలను అందించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు..

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తమ పిల్లలు అనుకోని పరిస్థితుల్లో నిర్బంధానికి గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ విభాగం, సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అవసరమైన కాన్సులేట్‌, న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. యువకులపై ఉన్న ఆరోపణలు, కేసు వివరాలు, తదుపరి న్యాయ ప్రక్రియపై అధికారిక సమాచారం వెలువడితేనే పూర్తి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు స్వదేశ్‌ పేర్కొనగా, కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లలను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement