రెబ్బెన: సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించేవరకు అన్ని రిజిష్టర్డ్ యూనియన్లకు సమాన హోదా కల్పించి ఆహ్వానించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి సీఅండ్‌ఎండీ బుద్దప్రకాశ్, డైరెక్టర్ గౌతమ్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చందన్నారు. ప్రభుత్వం, సింగరేణికి సంబంధించిన ఏజీ మరో వారం సమయం కావాలని కోరగా ఇదే చివరి అవకాశమని కోర్టు హెచ్చరిస్తూ ఈనెల 21వ తేదీకి వాయిదా వేసిందన్నారు.


