విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

లక్ష్మణచాంద: విద్యుత్‌ షాక్‌తో యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని పార్‌పెల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పార్‌పెల్లి గ్రామానికి చెందిన దావ వినేష్‌(32) గురువారం సాయంత్రం తన వరి పొలం ఒడ్డుపై గడ్డిని కోయడానికి గ్రాస్‌ కట్టర్‌ తీసుకుని వెళ్లాడు. కట్‌ చేసే సమయంలో బోరు మోటార్‌కు విద్యుత్‌ స్తంభం నుంచి స్టార్టర్‌కు వచ్చే విద్యుత్‌ తీగ ఒక చోట కట్‌ అయింది. వినేష్‌ గమనించలేదు. గ్రాస్‌ కట్టర్‌ కింది భాగానికి తెగిన వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికి కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి చిన్న గంగన్న ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. మృతుడికి భార్య అఖిల, ఇద్దరు రెండేళ్లలోపు కుమారులు ఉన్నారు.

వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..

రెబ్బెన: మండలంలోని నేర్పల్లి బస్టాప్‌ వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. తమకందిన సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై గోధుమ రంగు చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

నీటికుంటలో పడి బాలుడి..

ఉట్నూర్‌రూరల్‌: ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి బాలుడు మృతిచెందాడు. మండలంలోని లింగోజితండా పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. ఉట్నూర్‌ ఎస్సై గుంపుల విజయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర నుంచి కబీర్‌దాస్‌, సవిత దంపతులు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం లింగోజితండాకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు దేవిదాస్‌ (16) గురువారం తన ఇద్దరు సోదరులతో కలిసి రోజూ మాదిరిగా ఈత కోసం భీంగూడకు వెళ్లేమార్గంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు దేవిదాస్‌ నీటికుంటలో పడి పోయాడు. ఈ విషయాన్ని అన్న స్థానికులకు తెలిపాడు. ఉపసర్పంచ్‌ జాదవ్‌ హరిచంద్‌, సూరినాయక్‌ యువసేన యువకులతో కలిసి వెళ్లారు. నీటి గుంటలో దేవిదాస్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా కోసం ఉట్నూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఉపసర్పంచ్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

లోకేశ్వరం: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై భారతి తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని రాయాపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన తోండకూర్‌ శ్రీనివాస్‌(32) ఎలాంటి పనిచేయక తాగుడికి బానిసై తిరుగుతుండేవాడు. ఈనెల 13న మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వమని భార్య లావణ్యతో గొడవ పడ్డాడు. భార్య డబ్బులు ఇవ్వపోయేసరికి ఇంట్లో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడ బంధువు బక్కురి ఆనందం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement