ఉట్నూర్‌రూరల్: ఐటీఐ కళాశాలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏటీసీలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్ ఆఫర్ల లెటర్లతో వారి జీవితాలతో ఆడుకుంటున్నారని పలువురు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఐటీఐ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. పలువురు ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఆఫర్ల లెటర్లతో బెంగళూరు, పూణె, తమిళనాడు ఇతర రాష్ట్రాల వెళ్లాకా కంపెనీ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సంస్థ ద్వారా మొత్తం 117 మందికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. నిబంధనలు నచ్చక, వ్యక్తిగత కారణాలతో కొందరు తిరిగి వచ్చేశారన్నారు.


