వారంలో ప్రారంభిస్తామన్న ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
ఇప్పటికే రెండు కంపెనీలతో ఒప్పందాలు
మరిన్నింటిని ఆకర్షించేలా ప్రత్యేక సబ్సిడీలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ రెడీ అయింది. వారంలో ప్రారంభిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. ఇప్పటికే రెండు కంపెనీలు ఐటీ సేవలు అందిస్తున్నాయి. ఎన్‌టీటీ డాటా సొల్యూషన్(300 పోజిషన్‌కు అవకాశం), ఎన్‌ల్యాబ్స్ (150 పోజిషన్‌కు అవకాశం) కంపెనీలతో ఎంవోయూ చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు..
టవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరా బాద్, ఇతర ప్రధాన నగరాల నుంచి బీపీవో, ఐటీ అనెబుల్డ్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభా గాలకు చెందిన మరిన్ని మధ్యస్థాయి కంపెనీలను ఇక్కడికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, మౌలిక సదుపాయాల వెసులుబాటు కల్పిస్తుంది. ప్రారంభం నుంచి మొదలుకుంటే మూడేళ్ల వరకు కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు అద్దె రాయితీ కల్పిస్తోంది.
ప్రత్యేకతలు ..
మావల మండలం బట్టిసావర్‌గాంవ్ వద్ద జాతీయ రహదారి 44ను ఆనుకుని మూడెకరాల విస్తీర్ణంలో ఐటీటవర్ నిర్మించారు. తెలంగాణ పారిశ్రామిక మౌ లిక సదుపాయాల సంస్థ నోడల్ ఏజెన్సీగా ప్రాజెక్ట్ పనులు జరిగాయి. 65వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీప్లస్–4 అంతస్తుల్లో నిర్మించారు. 2022–23లో నిర్మాణం మొదలైంది. అంచనా వ్యయం రూ.43 కోట్ల నుంచి రూ.54 కోట్లకు చేరుకుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఆధునిక వర్క్ స్టేషన్లను సిద్ధం చేశారు. ఒక్కోషిప్ట్‌కు 660 మంది పనిచేసే సామర్థ్యం ఉంది. మూడు షిప్ట్‌ల్లో కలిపి దాదాపు 2వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెంట్రలైజ్డ్ ఏసీ, కాన్పరెన్స్ అండ్ మీటింగ్ హాళ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, క్యాంటీన్, రెస్ట్ రూంలు, విశాలమైన పార్కింగ్, లిఫ్ట్ వసతులు కల్పిస్తున్నారు.
మొదటి టైర్–3 ప్రాంతం..
రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్ కాగా, ఈ సేవలను అక్కడికే పరిమితం కాకుండా ద్వితీయశ్రేణి(టైర్–2, టైర్–3) నగరాలు, పట్టణా ల్లో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌లు, ఐటీ టవర్లను అందుబాటులోకి తెచ్చింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఇప్పటికే ఏర్పాటు చేసి విస్తరించింది. ఆదిలాబాద్ టైర్–3లోకి వస్తుంది. మొదటిసారి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. స్థానిక పట్టణాల నుంచి వచ్చే సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను, గ్రాడ్యూయేట్లను ఈ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. రానున్న కంపెనీలు కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


