ఆదిలాబాద్‌టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వన్‌టౌన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న శాంతినగర్‌కు చెందిన సాయిని ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడి నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరిట విడతల వారీగా రూ.1.40 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా, అదనంగా రూ.30 లక్షలు నగదు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అందులో కొంత మొత్తాన్ని లాభంగా తిరిగి ఇచ్చి, మిగిలిన మొత్తంపై కాలయాపన చేయడంతో మోసం జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు బండారి రాకేశ్‌ను విచారించగా, కుంటవార్ అచ్యుత్‌రెడ్డితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ పేరిట ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలిపారు. తెలిసిన వారిని నమ్మించి ఫోన్‌పే, గుగూల్‌పే, బ్యాంకు ఖాతాలు, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మంది నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు సేకరించినట్లు తెలిపారు. నిందితుడి అకౌంట్, అతడి భార్య ఖాతాల నుంచి అచ్యుత్‌రెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించారు. సంబంధిత బ్యాంకు లావాదేవీలు, ఖాతాల వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఈ నెల 11న విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఐ క్రాస్‌రోడ్ వద్ద రాకేశ్, అచ్యుత్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలిపారు. మరో నిందితుడు కుంటవార్ చంద్రకాంత్‌రెడ్డి పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, సంజయ్, అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


