పరిశీలనకు 134 మంది విచారణ అధికారులు
ప్రత్యేక లాగిన్ ఐడీలు క్రియేట్
ఈ నెల 15నుంచి ప్రక్రియ
కై లాస్‌నగర్: ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో అర్హులైన వారిని గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విచారణ అధికారుల నియామకంతో పాటు వారికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందించింది. ఈనెల 15నుంచి క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ షురూ కానుంది.
14వేల మంది దరఖాస్తు
గత ప్రభుత్వం చేపట్టిన ఆసరా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆరేళ్లుగా నిలిచిపోయింది. ఎంతో మంది అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పలేదు. ఈ క్రమంలో ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, బోధకాల వ్యాధిగ్రస్తులకు కొత్తగా పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ గడువు 31వ తేదీతో ముగిసింది. అయితే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారుంటే నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 15వరకు పొడిగించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 14,034 మంది ఆయా కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు.
గెజిటెడ్ అధికారులతో విచారణ
ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పింఛన్ దరఖాస్తులను ఈ నెల 15నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అర్హులైన వారికి నష్టం కలగకుండా, అనర్హులకు చోటు కల్పించకుండా ఉండాల నే ఉద్దేశంతో ఈ విచారణ బాధ్యతలను గెజిటెడ్ అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఏవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పీజీ హెచ్‌ఎంలు, పీఆర్, ఇరిగేషన్, హౌసింగ్, వాటర్‌గ్రిడ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వంటి వివిధ శాఖలకు చెందిన 134 మందిని విచారణ అధికారులుగా నియమించారు. మున్సిపల్‌లో కమిషనర్, మెప్మా పీడీలకు బాధ్యతలు అప్పగించారు. వారికి ఇప్పటికే ప్రత్యేక లాగిన్ ఐడీలు క్రియేట్ చేశారు. దరఖాస్తుల పరిశీలనపై ఆన్‌లైన్‌లో సెర్ప్ రాష్ట్రస్థాయి అధికారులు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందించారు. చేయూత ప్రత్యేక మొబైల్ యాప్‌లో ఈ దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. మండలంలోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా వాటిని విచారణ అధికారులకు అప్పగించనున్నారు.
పారదర్శకంగా ప్రక్రియ
కొత్త పింఛన్ ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఈ నెల 15 నుంచి షురూ కానుంది. సంబంధిత ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాం. ఎంపిక చేసిన గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. దరఖాస్తు సమయంలో ఏవైనా డాక్యుమెంట్స్ పొందుపర్చకుంటే వాటిని అప్‌లోడ్ చేయనున్నారు. అర్హులైన వారికి నష్టం కలగకుండా విచారణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
జిల్లాలో అందిన పింఛన్ దరఖాస్తుల వివరాలు కేటగిరీల వారీగా
దివ్యాంగులు 3,356
ఒంటరి మహిళలు 1,602
వితంతువులు 9,035
చేనేత కార్మికులు 04
గీత కార్మికులు 37


