ఆదిలాబాద్‌టౌన్: భూమాఫియాపై పోలీసులు కొర డా ఝళిపిస్తున్నారు. పేదలు, సామాన్యుల భూములపై కన్నేసి కబ్జా చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించడం, బెదిరింపులు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్న వారి భరతం పడుతున్నారు. ఎంతటి వారైనా లెక్కచేయడం లేదు. జిల్లాలో పేరుమోసిన రియల్టర్లను సైతం ఇటీవల కటకటాల వెనక్కి పంపడమే నిదర్శనం. ఎస్పీ అఖిల్ మ హాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. బాధితులకు న్యా యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు పెరిగి అక్రమార్కుల బాగోతాలు బయటపడుతున్నాయి.
తోకముడిచిన కబ్జాదారులు..
అఖిల్ మహాజన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరవుతోంది. ఇప్పటికే ఇసుక మాఫియా, వడ్డీ వ్యాపారులు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాలు తయారు చేసే డాక్యుమెంట్ రైటర్లు, తదితర నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. భూదందా పేరిట మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారులను సైతం వదిలిపెట్టడం లేదు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుంది. పలువురు ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేసుకొని స్థానికంగా కనిపించకుండా పోతున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ను వారం క్రితం అరెస్ట్ చేశారు. తాజాగా భోరజ్ మండలంలో భూ దందాకు సంబంధించి బడా వ్యాపారుల అరెస్టు అంశం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.


