ఇంకా గిట్టుపాట్లు! | - | Sakshi
Sakshi News home page

ఇంకా గిట్టుపాట్లు!

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను సేకరిస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చెబుతున్న మాటలు కార్యాచరణలో కానరావడం లేదు. గిరిజనులు సేకరించే కొండచీపుర్లు, శీకాయ, కరక్కాయ, తేనె వంటి ఉత్పత్తులకు నామమాత్రంగా ధర చెల్లిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు బయట దళారులే అధికంగా ధర చెల్లిస్తుండడంతో గిరిజనులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.

అటవీ ఉత్పత్తులకు లభించని

గిట్టుబాటు ధర

గిరిజనులకు తప్పని ఇబ్బందులు

పట్టించుకోని గిరిజన సహకార సంస్థ

రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని అడవిలో ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా అటవీ ఉత్పత్తుల సేకరణలో నిమగ్నమైన ఆదివాసీలకు అరకొర ధర చెల్లించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఎంతో కాలంగా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలని గిరిజనులు ఆందోళన చేస్తున్న జీసీసీ పట్టించుకోవడం లేదు. గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐటీడీఏ కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేయడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

కొండచీపుర్ల కొనుగోలుకు జీసీసీ ‘నో’

ఏజెన్సీలో కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా లభ్యమవుతాయి. మారేడుమిల్లి మండలంలో కొండచీపుర్లు, శీకాయ అటవీ ఉత్పత్తులు ఎక్కువగా లభ్యమవుతాయి. ఎంతో కాలంగా కొండచీపుర్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నా జీసీసీ ధర పెంచడం లేదు. పైగా గత రెండేళ్ల నుంచి జీసీసీ కొండచీపుర్లను కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు బయట ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది కొండచీపురు విడికట్ట రూ.40 నుంచి రూ.50 వరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనుల కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంలేదు. కొండచీపుర్ల సేకరణ కోసం గిరిజనులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పోడుభూముల్లో ఉన్న చీపురును, సహజంగా లభించే చీపురును సేకరించేందుకు రోజంతా కుటుంబం కష్టపడితే రూ.1000 విలువ చేసే చీపుర్లను అతి కష్టం మీద సేకరించగలరు. ఇంతా కష్టపడిన రూ.50కు అమ్ముకోవాల్సి వస్తుంది. చీపుళ్లను నిల్వ చేసి రేటు వచ్చిన తరువాత అమ్ముకొనే సదుపాయం గిరిజనులకు లేకపోవడంతో దళారులపైనే ఆధారపడవలసి వస్తోంది. జీసీసీ శీకాయను కూడా సహజ సిద్ధమైన పెద్దసైజును ఎగుమతి చేసేందుకు ఎంపిక చేసిన గ్రామాల నుంచి కొనుగోలు చేస్తుంది. జీసీసీ బయట మార్కెట్‌లో అధిక ధరకు శీకాయను అమ్ముకుంటున్న గిరిజనులకు అరకొర ధర చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండచీపురు కట్ట రూ.100కు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

వంద రకాల మాట ఉత్తుత్తే..

జీసీసీ సుమారు వంద రకాల అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని చెబుతున్న అనేక రకాల అటవీ ఉత్పత్తులను అసలు కొనుగోలు చేయడం లేదు. గిరిజనులకు అటవీ ఉత్పత్తుల సేకరణలో మెళకువలు నేర్పకపోవడంతో రెల్ల, నరమామిడి చెట్లు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ చెట్ల బెరడు కోసం మొత్తం చెట్లను నరికివేయడంతో చెట్లు అంతరించిపోతున్నాయి. బయట మార్కెట్‌లో కరక్కాయకు డిమాండ్‌ ఉన్న జీసీసీ కేజీ రూ.18 మాత్రమే కొనుగోలు చేస్తుంది. అనేక ఔషధాల్లో కరక్కాయను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏజెన్సీలో జీసీసీ తేనె సేకరించడం లేదు. జీసీసీ చెల్లించే ధర కేజీ రూ.300 ఉంటే బయట వ్యాపారులు రూ.500 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.

అన్నింటినీ కొనుగోలు చేయాలి

గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలి. గిరిజనుల కష్టానికి సరిపడా డబ్బులు కూడా రావడం లేదు. జీసీసీ కేవలం ఒకటి రెండు ఉత్పత్తుల కొనుగోలుపైనే దృష్టి పెడుతుంది. గిరిజనులు సేకరించే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాగే గిరిజనులు పండించే జాఫ్రా, జీడిమామిడి పిక్కలను జీసీసీ, ఐటీడీఏ కొనుగోలు చేయాలి.

– పల్లాల లచ్చిరెడ్డి, బూసిగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement