చింతూరు: ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు ఏజన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, 1/70 చట్టంపై గిరిజనేతరులు వేసిన కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంతో పాటు చట్టం పరిరక్షణ కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. గొత్తి కోయలకు కులధ్రువీకరణ పత్రాలు, పింఛన్లు మంజూరు చేయాలని, ఆదివాసీ పూజారులు, దేవర బాలలకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన కోరారు. ధర్నా విషయం తెలుసుకుని ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ వారితో చర్చించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయికా శంకర్, జిల్లా కన్వీనర్ పాయం లక్ష్మణరావు, శీలం కృష్ణ, మినప నాగేశ్వరరావు, కారం రవి, పూసం శ్రీను, సోడె మురళి, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ప్రసాద్, రాజయ్య పాల్గొన్నారు.
భారీ ర్యాలీ, ఐటీడీఏ ఎదుట ధర్నా


