అడ్డతీగల: రంపచోడవరం భాను ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి తనతో పాటు అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి హాజరవుతారన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించనున్నామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఐడెంటిటీ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. 12 మండలాల వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలి రావాలన్నారు.
నియామక ఉత్తర్వుల
నిలుపుదల
చింతూరు: రంపచోడవరం, చింతూరు సబ్ కలెక్టర్ల నియామకానికి సంబంధించి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం మరో ఉత్తర్వులను జారీ చేసింది. రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్‌కుమార్, చింతూరు సబ్ కలెక్టర్‌గా చిత్తపులి నరేంద్రపడాల్‌ను నియమించడంతో పాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌ను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా తదుపరి ఆదేశాల వరకు ఇద్దరు సబ్ కలెక్టర్ల నియామకాలతో పాటు చింతూరు ఐటీడీఏ పీవో బదిలీని నిలుపుదల చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


