కలెక్టర్ దినేష్‌కుమార్
రంపచోడవరం: స్థానిక లెనోరా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వికాస ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కె.దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలి
ఏజెన్సీ ప్రాంత యువతలో ప్రతిభ, కష్టపడే తత్వం, క్రమశిక్షణ, విశ్వసనీయత వంటి లక్షణాలు ఉన్నాయని, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుని అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జిల్లాలోని రంపచోడవరం, చింతూరు తదితర ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నేటి జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, ఎసెంచర్ తదితర ప్రముఖ సంస్థలతో కలిపి 40కి పైగా కంపెనీలు పాల్గొని సుమారు 1,500 ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు వివిధ రంగాల్లోని ఉపాధి, కెరీర్ అవకాశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర రంగాల్లోని అవకాశాలపై యువతకు మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. స్థానికంగా మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో లభించే అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రారంభంలో రూ.12 వేలు లేదా రూ.15 వేల వేతనం వచ్చినప్పటికీ నిరాశ చెందకుండా అనుభవాన్ని సంపాదించుకుంటూ నైపుణ్యాలను పెంచుకుని భవిష్యత్తులో నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగా సంపాదించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పోలవరం జిల్లాలోని 12 మండలాలకు సంబంధించిన చదువుకున్న యువతీయువకులు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయుటకు 396 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇందులో 212 మంది యువతీయువకులు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఎంపికై న వారికి ఆఫర్ లెటర్లు అందజేశారు. మొత్తం 40 కంపెనీల్లో 1500 మందిని మందిని ఎంపిక చేయుటకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ కోరారు. ఎస్‌ఎస్‌సీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన యువత కోసం 1,500కు పైగా ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం గొప్ప అవకాశమని తెలిపారు. కార్యక్రమంలో వికాస డైరెక్టర్ లచ్చారావు, లెనోరా సంస్థ డైరెక్టర్ ఇందిరా జాన్‌రత్నం, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి నిరుపమ, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి పెరుమలరావు, మేనేజర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.


