ప్రతీ పనిలో పైస్థాయి వరకు వాటాలు?
ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గుప్పిట్లో డివిజన్ కార్యాలయం
మరో ఉద్యోగి ఏళ్లుగా ఎఫ్‌డీవో కార్యాలయంలోనే తిష్ట
ఇటీవల బదిలీ అయినా కదలకుండా అక్కడే..
అక్రమాలకు అడ్డాగా ‘అటవీశాఖ’
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు ఇష్టారీతి న వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ డీఎఫ్‌వో లేకపోవడం, అలాగే ఆదిలాబాద్ డివిజన్‌కు సైతం ఇన్‌చార్జి అధికారే ఉండడంతో ఉద్యోగులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మా రింది. జిల్లాకేంద్రంలోని డివిజన్ కార్యాలయంలో కొన్నేళ్లుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కనుసన్నల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నలుగురు ఉద్యోగులు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది వరకు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తం 16 శాతం వరకు వారి స్థాయికి అనుగుణంగా వాటాలుగా వెళ్తున్నాయనేది ఆ శాఖలో బహిరంగ రహస్యమే.
ఏళ్లుగా ఇక్కడే తిష్ట
ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఏళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ఇటీవల డీఎఫ్‌వో కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ ఆ కుర్చీని వదిలిపెట్టడం లేదు. కాసులు కురిపించే సెక్షన్ కావడంతో అధికారులను మచ్చిక చేసుకొని రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తె లుస్తోంది. ఆ సెక్షన్‌కు కేటాయించిన ఉద్యోగికి సై తం చార్జి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా రు. గతంలో ఈ ఉద్యోగి ఇచ్చోడ డివిజన్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆదిలాబాద్‌లోనే తిష్ట వేశాడు. ఇచ్చోడ, ఆదిలాబాద్ డివిజన్ అకౌంట్స్ ఆయనే ఏళ్లుగా చూస్తున్నాడు. కమీషన్లతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ ఉద్యోగికి కార్యాలయంలో పనిచేసే మరో నలుగురు సైతం వత్తాసు పలకడం గమనార్హం. అంతేకాకుండా తనకు ఓ రాజకీయ నాయకుడు బంధువని చెబుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు..
ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. డివిజన్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు బదిలీ కాగా, ఒక ఉద్యోగి మాత్రమే తనకు కేటాయించిన డీఎఫ్‌వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మరో ఉద్యోగి ఇప్పటివరకు రిలీవ్ కాలేదు. పాత స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల పీసీసీఎఫ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను వారి స్థానాలకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు ఎఫ్‌బీవోల డిప్యూటేషన్ రద్దు కాగా, వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరారు. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి డీఎఫ్‌వో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ రద్దు చేసినప్పటికీ సదరు ఉద్యోగి అక్కడికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతుండడం గమనార్హం.
ఆదేశాలు జారీ చేశాం
ఎఫ్‌డీవో కార్యాలయం నుంచి డీఎఫ్‌వో కార్యాలయానికి ఇద్దరు ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒకరు ఇప్పటికే విధుల్లో చేరగా, మరొకరు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఉద్యోగికి పలుమార్లు తెలియజేశాం. నలుగురు ఎఫ్‌బీవోల డిప్యూటేషన్లు రద్దు కాగా, వారు సొంత స్థానాలకు వెళ్లారు. నిర్మల్‌కు చెందిన ఉద్యోగి డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేశాం. ప్రస్తుతం ఆ ఉద్యోగి ఇక్కడే పనిచేస్తున్నారు.
– ప్రేమలత, ఏవో,
డీఎఫ్‌వో కార్యాలయం, ఆదిలాబాద్
అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది స్థాయి వరకు అధికారులు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ స్థాయి అధికారికి 5శాతం, ఉన్నతాధికారులకు 3 శాతం, రేంజ్ క్లర్క్‌కు ఒక శాతం, డివిజన్‌లో పనిచేసే క్లర్క్‌లకు 2శాతం, సర్కిల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు 1.5 శాతం.. ఇలా వాటాలు పంచుకుంటారనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా మిగతావి ఎఫ్‌ఆర్‌వో స్థాయి అధికారికి 4 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత సెక్షన్ క్లర్క్‌లకు వాటాలు ఉండడంతో కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అదే సీట్లో ఉంటే వారే పంచుకుంటారా.. వాటా కోసం తమవంతు ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలా కమీషన్లు రావడంతో కొందరు ఉద్యోగులు అకౌంట్ సెక్షన్‌లోనే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారు.


