కై లాస్‌నగర్/తాంసి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తాంసి మండలంలోని ఘోట్కోరి, భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటితో పాటు ఆదిలాబాద్ పట్ట ణంలోని ప్రభుత్వ డైట్ కళాఽఽశాల, ఆర్‌పీఎల్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియపై ఆరా తీశారు. కొత్త ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేర కు గుర్తించి తొలగించాలన్నారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహసీల్దార్లు సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా చైతన్యపర్చాలన్నారు. బీఎల్‌వోలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, జాద వ్ గణేశ్, రమేశ్, నాయబ్ తహసీల్దార్లు సూరజ్, ఇస్తారీ, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎన్నికల సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు మతీన్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


