బసవన్నల పండుగ చేద్దాం! | - | Sakshi
Sakshi News home page

బసవన్నల పండుగ చేద్దాం!

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

● నేడు పొలాల అమావాస్య ● ఎడ్ల పండుగగా ప్రతీతి

కెరమెరి/బోథ్‌: పండుగలన్నీ మానవజాతికి చెందినవే. కానీ పొలాల అమావాస్య మాత్రం ఎద్దులకు చెందిన ప్రత్యేక పండుగ. శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగ పొలాల అమావాస్యను గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. గురువారం పండుగ నేపథ్యంలో బుధవారమే ఎడ్లను శుభ్రంగా కడిగి ఇళ్లకు తీసుకెళ్లారు. నేడు గురువారం ఎద్దుల కొమ్ములకు రకరకాల రంగులు వేస్తారు. వీపుపై జూలు, మెడలో గంటలతో పాటు బహుసుందరంగా వాటిని అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఐదుసార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం గ్రామ పటేల్‌ తోరణం తెంపిన తర్వాత ఎడ్లను ఇళ్లకు తీసుకెళ్తారు.

నైవేద్యంగా...

ఆలయాల్లో ప్రదక్షణ అనంతరం ఎడ్లను ఇళ్లకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ రోజు చేసిన వంటకాలు నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు తిన్న వాటిని కుటుంబ సభ్యులు ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమని పెద్దలు చెబుతున్నారు. ఎడ్లు లేని రైతులు కూడా తమ బంధువుల ఎడ్లను తీసుకవచ్చి పూజలు నిర్వహస్తారు.

శుక్రవారం బడుగ..

పొలాల అమావాస్య మరుసటి రోజు బడుగ పండుగ జరుపుకుంటారు. శ్రావణమాసంలో నెల రోజులు మాంసాహారం ముట్టకుండా నియమ నిష్టలు పాటించి శుక్రవారం రోజు మాంసాహారం స్వీకరిస్తారు. ‘ఈగలు, దోమలు, రోగాలు, తీసుకపోరా బడుగ’ అంటూ ఇంటి నుంచి కేకలు వేస్తూ రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామ పొలిమేర వరకు వెళ్తారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధులు పారిపోతాయని గ్రామీణ ప్రజల నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement