జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు తొమ్మిది నెలల్లో 150 మందికి పైగా ఆత్మహత్య చిన్న చిన్న కారణాలకే ఆత్మస్తైర్యం కోల్పోతున్న వైనం ఆలోచిస్తే ఆనందమయ జీవితం సొంతం
మంచిర్యాలక్రైం: సృష్టిలో వెలకట్టలేనిది ప్రాణం.. కానీ కొందరు క్షణికావేశంలో దానిని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారితో పెనవేసుకున్న బంధాలను బలవంతంగా తెంచేసుకుంటూ.. కన్నవారికి, కట్టుకున్నవారికి ఆప్తులకు తీరని విషాదం మిగిల్చి వెళ్తున్నారు.. ఈ మధ్య కాలంలో జిల్లాలో అత్మహత్యల తీరు ఆందోళన కలిగిస్తోంది. అప్పులు, ఉద్యోగం రావడం లేదని, దంపతుల మధ్య గొడవలు, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలాంటి చిన్నచిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలు తమకే ఉన్నాయని, వాటిని అధిగమించలేమోనని ఆత్మస్థైర్యం కోల్పోతున్నా రు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 150 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆలోచిస్తే ఆనందమయం..
అర్ధంతరంగా చావు కొని తెచ్చుకునే సందర్భంలో ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇలా బతుకును జయించిన వారు ఉన్నారని, సానుకుల దృక్పథంతోనే జీవితానికి సార్ధకత అందుతుందని అంటున్నారు. మానసికంగా బలహీనమైన క్షణాల్లో తీసుకునే నిర్ణయమే జీవితానికి అటు.. ఇటుగా మారుతోందని, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆనందమయ జీవితాన్ని అందుకోవచ్చని, ఆత్మహత్యల వల్ల సాధించేది ఏమీలేదని, సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాలని పోలీస్ అధికారులు, చెబుతున్నారు.


