‘కాకతీయ’.. ఇదేం మాయ..!? | - | Sakshi
Sakshi News home page

‘కాకతీయ’.. ఇదేం మాయ..!?

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

ఆన్సర్‌షీట్‌ పూర్తిగా లేదని ‘మాల్‌ప్రాక్టీస్‌’ విద్యాసంవత్సరం కోల్పోయిన విద్యార్థిని తండ్రితో కలిసి యూనివర్సిటీ చుట్టూ ప్రదక్షణలు చివరకు లోకాయుక్తాను ఆశ్రయించిన వైనం

నిర్మల్‌: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని కలలను చిదిమేసింది. చేయని తప్పుకు పెద్దశిక్ష వేసింది. బీకాం కంప్యూటర్స్‌ ఆరో సెమిస్టర్‌ ఇంగ్లిష్‌ ఆన్సర్‌షీట్‌లో రెండు పేజీలు లేవంటూ రిజల్ట్‌ మెమోలో అన్ని సబ్జెక్టులకూ ‘మాల్‌ ప్రాక్టీస్‌’గా పేర్కొంది. ‘సార్‌.. నేనే తప్పూ చేయలేదు. నాకెందుకు ఈ శిక్ష..’ అంటూ కాలేజీలు, వర్సిటీల చుట్టూ తిరిగింది. ఎక్కడా న్యాయం జరగలేదు. నియమాలు, నిబంధనలు అంటూ వర్సిటీ చెబుతోంది. చేసేది లేక.. తండ్రి తన బిడ్డతో కలిసి ఇటీవల ‘మీరైనా న్యాయం చేయండి..’ అంటూ లోకాయుక్తాను ఆశ్రయించారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కంజర్‌ గ్రామానికి చెందిన బర్కుంట గంగాభవాని నిర్మల్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చదివింది. ఏప్రిల్‌లో ఆరో సెమిస్టర్‌ పరీక్షలు రాసింది. నెల తర్వాత వచ్చిన ఫలితం ఒక్కసారిగా ఆమెను షాక్‌కు గురిచేసింది. అన్ని సబ్జెక్ట్‌ల గ్రేడ్‌ స్థానంలో ‘ఎంపీ’(మాల్‌ ప్రాక్టీస్‌) అని వచ్చింది. వర్సిటీ వరకు వెళ్లి ఆరా తీస్తే.. ఇంగ్లిష్‌ పరీక్ష జవాబు పత్రాలు పూర్తిగా లేవన్నారు. డిగ్రీ విద్యలో విలువైన ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయింది.

‘లోకాయుక్తా’... న్యాయం చేసేనా..!?

తనకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ చుట్టూ పలుమార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో గంగాభవాని, తండ్రి గంగారాం ఇటీవల లోకాయుక్తాను ఆశ్రయించారు. మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలు తొలగించి, విద్యాసంవత్సరం నష్టపోకుండా న్యాయం చేయాలని వేడుకున్నారు. పిల్లల భవిష్యత్‌తో ముడిపడిన ఇలాంటి వ్యవహారాల్లో యూనివర్సిటీ బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలా మమ్మల్ని బాధపెట్టొద్దని తండ్రి గంగారాం వాపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement