నేరడిగొండ: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం నేరడిగొండ పోలీసులు బోరిగాం శివారులో తనిఖీలు చేపట్టారన్నారు. వారిని గమనించిన బోరిగాంకు చెందిన ఆడే కపిల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని చేనులో పరిశీలించగా పత్తి పంట మధ్యలో 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలు కనిపించడంతో దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక గంజాయిని రహస్యంగా సాగు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ రూ.12.50 లక్షల వరకు ఉంటుందన్నారు. గంజాయి సాగుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


