ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్‌వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది.
ప్రారంభంకాని మరమ్మతులు..
నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్‌ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్‌వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సామర్ధ్యంపై అనుమానాలు..
కుప్టి వద్ద కడెం వాగుపై 1982లో బ్రిడ్జి నిర్మించారు. 10 నుంచి 20 టన్నుల బరువు ఉన్న వాహనాలే ఎక్కువగా రాకపొకలు సాగించేవి. కానీ పదేళ్లుగా ట్రాన్స్‌పోర్టులో మార్పులు రావడంతో భారీ కంటైనర్‌లు, వాహనాల్లో 55 టన్నుల వరకు లోడ్‌తో ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉన్న ఈ జాతీయ రహదారిలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో భారీ లోడ్‌తో ఉన్న పుల్లర్ వాహనాలు సైతం ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 55 టన్నుల కంటే రెండు రెట్ల ఎక్కువ లోడ్ ఉంటున్నట్లు సమాచారం. దీంతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జికి బుంగ పడటంతో బ్రిడ్జి సామర్ధ్యాలపై అనుమానాలకు తావిస్తోంది. బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలు సాగిస్తామని చెప్తున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం బ్రిడ్జి నాణ్యత ప్రమాణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..
బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


