నిర్మల్‌టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్‌స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్‌ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


