ఏడాది ముందుగానే సన్నాహాలు..
మంత్రి జూపల్లి కృష్ణారావు
రూ.354 కోట్లతో ఆలయ పనులకు శ్రీకారం
రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
భక్తులకు మెరుగైన వసతులు
పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో పనులు
గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


