ఆన్‌లైన్‌లో కనిపించని కళాశాలలు ఆధార్ మిస్ మ్యాచ్, నాట్‌ఫౌండ్ (మ్యాప్డ్) సమస్య అధికం ఈ–పాస్ వెబ్‌సైట్‌లో నమోదుకు ఆటంకం విద్యార్థులకు తప్పని నిరీక్షణ కార్యాలయాల చుట్టూ తప్పని ప్రదక్షణ
స్థానిక ఐజా కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న మధుకర్ మూడు నెలల క్రితం ఎస్సీ హాస్టల్‌లో ప్రవేశం పొందాడు. అయితే స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో పేరు ఉంటేనే వసతిగృహంలో లెక్కించబడుతుంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో కాలేజీ పేరు కనిపించకపోవడం, సాంకేతిక లోపాల వల్ల కాలేజీ ఐడీ, హాస్టల్ స్కాలర్‌షిప్ డేటా అప్‌డేట్‌కు ఆటంకంగా మారింది. మూడు నెలలు గడిచిపోవడంతో వార్డెన్లు హాస్టల్‌కు సంబంధించిన బిల్లులు సమర్పించాల్సి వస్తోంది. కానీ ఆన్‌లైన్ ప్రవేశం లేని విద్యార్థుల విషయంలో ఏంచేయాలో పాలుపోక వార్డెన్లు గందరగోళంలో పడ్డారు. ఆన్‌లైన్‌లో కళాశాలల పేరు లేకపోవడం.. ఆధార్‌లో తప్పుల కారణంగా జిల్లాలో 65 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతి గృహాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ కార్డులోని తప్పులు ఆటంకంగా మారాయి. పదో తరగతి ఒరిజినల్ మెమోలు రాకపోవడం, ఆధార్‌లో పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండడంతో తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్, హాస్టల్ ప్రవేశాలకు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంటర్, వృత్తి విద్య కోర్సులు చదివే గ్రామీణ ప్రాంత ఎస్సీ విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో రెండేసి హాస్టళ్లలో 100 నుంచి 150 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ సవరణలు జరగటానికి ఆలస్యం అవుతుండటంతో ఆన్‌లైన్ దరఖాస్తులు ముందుకు సాగడం లేదు. నమోదు ప్రక్రియ ఆలస్యమై హాస్టల్ సీట్లు నిండిపోతే చదువుకు దూరమవుతామోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసే వార్డెన్లకు ఆధార్‌కార్డుతో సరిపోలకపోవటంతో (మిస్‌మాచ్డ్) వెబ్‌సైట్‌లో కనిపించడంతో సమస్య పరిష్కారం తలకు మించిన భారంగా మారింది.
బీసీ, ఎస్టీ తరహాలో ఎస్సీ ప్రవేశాలు కల్పిస్తే..
పోర్టల్‌లో వివరాలను వెంటనే అప్‌డేట్ చేసి, కళాశాలల పేర్లు కనిపించేలా సంబంధిత అధికారులతోపాటు ఆయా కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాల్సి ఉంది. పోర్టల్‌లో సమస్య పరిష్కారమయ్యే వరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి ఇస్తే విద్యార్థులకు తాత్కాలిక ఇబ్బందులు తొలగుతాయి. స్కాలర్‌షిప్‌తో నిమిత్తం లేకుండా బీసీ, ఎస్టీ హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించినట్లే ఎస్సీ వసతి గృహల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
పోర్టల్‌లో కళాశాలల నాట్‌ఫౌండ్
విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఈ– పాస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో కళాశాలల పేర్లు కని పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కళాశాలల వివరాలు (మాస్టర్ డేటా) సిస్టమ్‌లో అప్‌డేట్ కాకపోవడంతో పోర్టల్‌లో నాట్‌ఫౌండ్ అని వస్తుండటంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగా ల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం మాస్టర్ డేటా ను అప్‌డేట్ చేస్తోంది. కొన్ని కళాశాలల యా జమాన్యాలు రెన్యూవల్ సమాచారం, అనుబంధ ఆఫిలియేషన్ పత్రాలను సమయానికి సమర్పించకపోవడం, సాంకేతిక కారణమో తెలియదుగానీ ఆలస్యమవుతోంది. స్కాలర్‌షిప్ దరఖాస్తులతోనే కళాశాలల, హాస్టల్ ప్రవేశాలు ముడిపడి ఉండటంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హాస్టల్ బిల్లుల సమర్పణకు సంబంధించి వార్డెన్లపై ఒత్తిడి పెరుగుతోంది. మూడు నెలల వసతి సౌకర్యం కల్పించిన వార్డెన్లు ఆన్‌లైన్‌లో పేరు లేకపోవడం వల్ల వెళ్లిపొమ్మనే పరిస్థితులుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


