ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అనారోగ్యం, ఒంటరితనం భరించలేక
ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అనారోగ్యంతో వివాహిత..
తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఇప్ప అనుసూయ(46) వివాహిత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో జీవితంపై విరక్తితో ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. భర్త లస్మన్న ఫిర్యాదు మేరకు ఎస్సై పీర్‌సింగ్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఎండీ.సమ్రీన్ (24) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై పీర్‌సింగ్‌నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సమ్రీన్‌కు గతేడాది బాబు జన్మించాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి షేక్ సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీర్‌సింగ్‌నాయక్ తెలిపారు.
ఉరేసుకుని వ్యవసాయ కూలీ..
తాంసి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యవసాయ కూలీ పంటచేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాంసి మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాంసికి చెందిన బెల్లపు అనిల్(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా వెన్నుపూస, నరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నా నొప్పి తగ్గలేదు. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని పంటచేల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉందయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవన్‌రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్య రమ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడితోపాటు దివ్యాంగురాలైన కూతురు ఉంది.
భవనం పైనుంచి దూకి యువకుడు..
కోటపల్లి: అనారోగ్య సమస్యలతో ఒంటరిగా ఉంటున్న యువకుడు మనస్తాపంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలంలోని నాగంపేటకు చెందిన దుర్గం మల్లయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు స్వామిరాం(26) డిగ్రీ పూర్తి చేశాడు. 2025లో ఎన్‌ఐటీ నాగ్‌పూర్‌లో సీటు రాగా, అనారోగ్య సమస్యలతో జాయిన్ కాలేదు. ఇంటి వద్దే ఉండి కుటుంబసభ్యులకు ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రవేశం పొందాడు. నాలుగు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నాడు. ఒక వైపు అనారోగ్య సమస్యలు, ఒంటరితనం భరించలేక ఆదివారం ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం మూడోఅంతస్తు నుంచి దూకాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, తండ్రి మల్లయ్య కోటపల్లి రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమారుడు ఉద్యోగం సాధించి తమతో ఉంటాడని అనుకున్న తరుణంలో ఇలా జరగడంతో తండ్రి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. స్వామిరాం మృతితో నాగంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి.


