గిరిజన తెగకు చెందిన మథుర లబానాలకు జిల్లా పుట్టినిల్లుగా మారింది. సంచార జీవ నం క్రమంగా తగ్గి ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయం, పశుపోషణ వీరి జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు వేషధారణతో ప్రత్యేక గుర్తింపు పొందిన వీరిపై ఈ వారం సండే స్పెషల్. – ఇచ్చోడ
శ్రీకృష్ణుడు ఇలవేల్పుగా..
ప్రత్యేక వస్త్రధారణ
మథుర మహిళలు సంప్రదాయ వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రంగురంగుల వస్త్రాలతోపాటు వెండి, ఇత్తడితో చేసిన ఆభరణాలు ధరిస్తారు. చేతులకు కడియాలు, చెవులకు పెద్ద సైజు రింగులు, మెడలో పూసల దండలు కనిపిస్తాయి. పొడవాటి జుట్టుతో కూడిన అలంకరణతో పాటు చీర కట్టు మరో ప్రత్యేకత.
వీరు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. అలాగే హోలీ పండుగను రంగులతో పాటు సంప్రదాయ నృత్యాలతో ఘనంగా జరుపుకుంటారు. తమ పూర్వీకుల చరిత్రను, ప్రకృతిని, దేవుళ్లను కీర్తిస్తూ లబానా భాషలో పాటలు పాడుతారు. బండారాలోనూ భాగస్వాములవుతారు. తీజ్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రావణమాసంలో రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగలో మహిళలు గోధుమలను వెదురు బుట్టలలో వేసి పెంచుతారు. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ కార్యక్రమాలను పెళ్లికాని యువతులు నిర్వహిస్తారు.
సంస్కృతిని కాపాడుకుంటున్నాం..
అనాదిగా వస్తున్న మథుర సంస్కృతిని తరాలుగా కాపాడుకుంటున్నాం. ఆధునికత పెరుగుతున్నా సంప్రదాయాలను కొనసాగిస్తున్నాం. భావితరాలకు అందిస్తున్నాం.
– నిస్తే దర్యావ్‌సింగ్ మహరాజ్,
మాంజిరతండా, బజార్‌హత్నూర్ మండలం
పండుగలప్పుడు ఊరంతా సందడి..
మా ఇలదైవం శ్రీ కృష్ణుడు. కృష్ణాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. తీజ్‌తో పాటు బండారా వేడుకలను కోలహలంగా నిర్వహించుకుంటాం. ఈ పండుగలప్పుడు బంధువులతో ఊరంతా సందడిగా ఉంటుంది.
– సాబ్లె ప్రతాప్‌సింగ్, నేరడిగొండ
ఆటపాటలకు పెద్దపీట
మా గ్రామాల్లో ఆటపాటలకు పెద్దపీట ఉంటుంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంతా కలిసి ఉత్సహంగా పాల్గొంటాం. పండుగలను ఊరంతా కలిసి ఓకే చోట జరుపుకుంటాం. – నారాయణ్‌సింగ్,
లింగట్ల, నేరడిగొండ మండలం
సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు


