బ్రిడ్జిపై టమాటా లారీని ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
ఎన్‌హెచ్–44పై స్తంభించిన రాకపోకలు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు అవస్థలు
నేరడిగొండ/ఇచ్చోడ: నిర్మల్–ఆదిలాబాద్ 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తరచూ ఆటంకం ఎదురవుతోంది. మండల పరిధిలోని కుప్టి వద్ద ఉన్న పాత వంతెన కుంగిపోవడంతో అధికారులు ఇటీవల దానిపై రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా రాకపోకలు సాగించే వాహనాలన్నింటినీ ఒకే వంతెన మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికితోడు శుక్రవారం రాత్రి బ్రిడ్జి వద్ద టమాటా లారీ, సిమెంట్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
పక్షం రోజులుగా ఇదే దుస్థితి..
వంతెన కుంగిపోయి 15 రోజులు గడుస్తున్నా నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు, సంబంధిత యంత్రాంగం గానీ ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వంతెన పైనుంచి భారీ వాహనాలు, బస్సులు, కార్లు వెళ్లాల్సి రావడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.
ప్రమాదానికి గురైన వాహనాలు,
చిందరవందరగా పడి ఉన్న టమాటాలు
బ్రిడ్జిపై రెండు వాహనాలు ఢీ
ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కుప్టి జాతీయ రహదారిపై గల బ్రిడ్జిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి 11 దాటాక జరిగిన ఈ ఘటనలో గాయాలపాలైన డ్రైవర్ శనివారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగపూర్ వైపు టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సిమెంట్ క్రషర్ వాహనం కుప్టి జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో టమాటాలు చెల్లాచెదురైపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐచర్ వాహన డ్రైవర్ మహమ్మద్ యూసుఫ్(38) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా, ఐచర్ క్లీనర్, క్రషర్ వాహన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


