చెరువులో పడి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలుడు మృతి

Sep 5 2026 1:44 AM | Updated on Sep 5 2026 1:44 AM

కుభీర్‌: ఎల్లమ్మ చెరువులో గత నెల 10వ తేదీన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం మరువక ముందే శుక్రవారం మరో బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవిదాస్‌ (16) శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు ఎల్లమ్మ చెరువు కట్ట వద్దకు ఇతరులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో గొర్రెలు నీరు తాగుతుండగా ఒక గొర్రెపిల్ల నీటిలోకి వెళ్లింది. దానికి బయటకు తీసేందుకు నీటిలోకి వెళ్లి గుంతలో పడిపోయాడు. గమనించిన కాపరులు వెంటనే బయటకు తీయగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. దేవిదాస్‌కు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరు..

నిర్మల్‌టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చింతకుంటవాడ కాలనీకి చెందిన పోలకొండ లక్ష్మీనారాయణ వర్మ (50) శాంతినగర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా జయశంకర్‌ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే లక్ష్మీనారాయణ వర్మను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఉండగా, సంతానం లేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కాలువలో పడి యువకుడు..

ముత్తారం: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం(21) ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం.. సాయిరాం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖ మ్మంపల్లిలోని తమ బంధువు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చాడు. పనిమీద ఖమ్మంపల్లి నుంచి హ రిపురం వచ్చి మళ్లీ ఖమ్మంపల్లికి తిరిగి వెళ్తున్న క్ర మంలో కేశనపల్లిలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద బైక్‌ అదుపుతప్పి కాలువలో పడి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ వివరించారు.

కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

బజార్‌హత్నూర్‌: కడుపునొప్పి భరించలేక యువతి కోలపురి స్రవంతి(18) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన కోలపురి గంగన్న –అడెల్లబాయిల కూతురు స్రవంతి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి వెంటనే స్రవంతిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు. మృతురాలు బజార్‌హత్నూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

మద్యానికి బానిసై ఒకరు..

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని బృందావన్‌కాలనీకి చెందిన శివ్‌శెట్టి మన్మద్‌(32) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేవ్‌ జిల్లా ధర్మబాద్‌కు చెందిన శివ్‌శెట్టికి ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన యువతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ సభ్యులతో కలిసి బృందవన కాలనీలో నివాసముంటున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. మద్యం మానేయాలని తండ్రి విఠల్‌ మందలించాడు. దీంతో గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

ఇచ్చోడ: మండలంలోని కామాగిరి గ్రామానికి చెందిన రైతు ఫడ్‌ భగవత్‌కు చెందిన గేదె శుక్రవారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మేస్తుండగా విద్యుత్‌ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement