రెబ్బెన: మహారాష్ట్రలోని బల్లార్షాలో గంజాయి కొనుగోలు చేసి రెబ్బెనలో విక్రయించేందుకు తీసుకొస్తు న్న వ్యక్తులను గురువారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో శుక్రవారం సీఐ సంజయ్ వివరాలు వెల్ల డించారు. ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రెబ్బెన బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు పో లీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 130 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులు రెబ్బెన మండలం జక్కులపెల్లికి చెందిన దాగం సందీప్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన కొండగుర్ల రాజేంద్రప్రసాద్‌గా గుర్తించారు. నింది తులు జక్కులపెల్లికి చెందిన దుర్గం అభినేష్ అలి యాస్ చింటూతో కలిసి గురువారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ అజిత్ వికాస్ వద్ద 130 గ్రాముల గంజాయిని రూ.7వేలకు కొనుగోలు చేశారు. దాన్ని గంజాయి సేవించే అలవాటు ఉన్న రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన పబ్బతి అనిల్, మేడి అంజయ్యతో పాటు మరికొంత మందికి విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది రవికుమార్, పీసీ నౌషద్‌లు ఉన్నారు.
పెరట్లో గంజాయి సాగు
సిరికొండ: సిరికొండ మండల కేంద్రానికి చెందిన గైక్వాడ్ రుక్మాబాయి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇచ్చోడ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంటి పెరట్లో కంది పంట మధ్య సాగు చేస్తున్న 46 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 136 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ రూ.4.60 లక్షలు, ఎండు గంజాయి విలువ రూ.3,400 ఉంటుందని తెలిపారు. గైక్వాడ్ రుక్మాబాయితో పాటు ఆమె కుమారుడు గైక్వాడ్ బాలాజీపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


