జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించని బాధ్యతలు తొలగించిన ఆపరేటర్లతోనే ‘రెవెన్యూ’ విధులు వారు తరచూ గైర్హాజరు.. రిజిస్ట్రేషన్లకు ఆటంకం భూక్రయ, విక్రయదారులకు ఇక్కట్లు
కై లాస్‌నగర్: భూభారతి పోర్టల్‌లో ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం ఇటీవల తొలగించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వీరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆ స్థానాల్లో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అయితే తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న తమను ఉన్నపాటుగా తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతంందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈక్రమంలో యంత్రాంగం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతోంది. ఫలితంగా ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి వ్యవహారాలను వారే చూస్తున్నారు. వారికి కేటాయించిన లాగిన్లతోనే రిజిస్ట్రేషన్లు, విరాసత్ వంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం తొలగిస్తూ ఆదేశాలు జారీచేసినా వారే విధులు నిర్వహిస్తుండడంతో వారు ఉన్నట్లా లేక తొలగించినట్లా అనే దానిపై స్పష్టత కరువైంది.
ప్రత్యేక శిక్షణ ఇచ్చినా..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాయంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేస్తున్న 21 మంది జూనియర్ అసిస్టెంట్లను ఎంపిక చేసింది. భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్లు ఇతర కార్యకలాపాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసి సుమారు నెలరోజులు కావస్తున్నా వారికి సంబంధిత లాగిన్లు ఇవ్వలేదు. మరోవైపు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్లు నిరసనకు దిగుతూ తర చూ విధులకు గైర్హాజరవుతున్నారు. వీరు అందుబాటులో లేకపోవడం, శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్ ఐడీలు ఇవ్వకపోవడంతో రిజి స్ట్రేషన్ల ప్రక్రియకు ఇటీవల తరచు అంతరాయం ఏర్పడుతంంది. జిల్లాలో సగటున రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరగనున్నట్లుగా అధికా రులు చెబుతున్నారు. భోరజ్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, భీంపూర్, తాంసి వంటి మండలాల్లో సగటున రోజుకు 4 నుంచి 5 రిజిస్ట్రేషన్లు అవుతాయని చెబుతున్నారు. అయితే మూడు రోజులుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈక్రమంలో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందుల్లేకుండా చర్యలు
భూభారతి ఆపరేటర్లను ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాలో 21 మందిని ఎంపిక చేసి ఇటీవల వారికి ప్రత్యేక శిక్షణ అందించాం. త్వరలోనే వారికి లాగిన్ ఐడీలు క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
– ఆర్‌ఎస్.చిత్రూ, అడిషనల్ కలెక్టర్
ఇక్కడ కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎం.సత్తయ్య, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అమరేందర్. వీరు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామంలో మూడెకరాల వ్యవసాయభూమిని ఇటీవల కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం మీసేవలో స్లాట్ బుక్ చేసుకోగా మంగళవారం సమయమిచ్చారు. భూమిని అమ్మే రైతు సాక్షులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆపరేటర్ అందుబాటులో లేడనే కారణంతో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టలేదు. చేసేదిలేక వారు వెనుదిరిగారు. ఇది ఒక్క వీరి సమస్యే కాదు.. జిల్లా వ్యాప్తంగా భూములు అమ్మడం, కొనుగోలు చేయాలనుకునే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.


