రిమ్స్ అధికారుల చర్యతో ఎల్టీలకు ఇబ్బందులు కొందరికి టర్మినెట్ ఆర్డర్.. మరికొందరికి నోటీసు మెడికల్ కళాశాలలో పనిచేసేవారికి వేతనాలు.. ఆస్పత్రిలో పనిచేసే వారికి మొండిచెయ్యి అధికారుల తీరుపై విమర్శలు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ అధికారుల తీరుపై ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి టర్మినెట్ ఉత్తర్వులు అందజేసి.. మ రికొంత మందికి నోటీసులు జారీ చేసి వారిని కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రి మ్స్‌కు సంబంధించిన కళాశాల, ఆస్పత్రిలో వేర్వేరుగా నిబంధనలు పాటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత మార్చి 31న డీఎంఈ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను టర్మినెట్ చేయాలని ఉత్తర్వులు జారీ చే సింది. రెగ్యులర్ సిబ్బందిని నియమించడంతో మ ళ్లీ కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయలేమని అందులో స్పష్టం చేశారు. తీరా జూలైలో మళ్లీ ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొందరికి మాత్రమే చోటు దక్కింది. ఆస్పత్రిలో పనిచేసే ఎల్టీలకు టర్మినెట్ చేయగా, మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగిస్తుండటం, ఇటీవల వారికి వేతనాలు జమ చేయడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
మార్చి 31న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) నుంచి ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను టర్మినెట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు ఎల్టీలు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. రిమ్స్ కళాశాల పరిధిలో 9 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు రిమ్స్ కళాశాలలో, కొంత మంది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, ఇంకొందరు టీ–హబ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయి. అయితే డీఎంఈ ఆదేశాల మేరకు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురిని టర్మినెట్ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. కళాశాలలో పనిచేస్తున్న వారికి మాత్రం టర్మినెట్ ఆర్డర్ ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి కొనసాగిస్తున్నారు. అనధికారికంగా వారితో సేవలు చేయించుకుంటున్నారు. అయితే కొనసాగింపు ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాలు లేనప్పటికీ వారితో పనులు చేయించడంపై చర్చ సాగుతోంది. వారికోసం ప్రత్యేకంగా ఓ హాజరుపట్టిక ఏర్పాటు చేసి సంతకాలు చేయించినట్లు సమాచారం.
వేతనాలు ఇస్తారా..
ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఉద్యోగికి నెలకు రూ.22,500 వేతనం చెల్లిస్తారు. గత జూలై నుంచి ఇప్పటివరకు ఆస్పత్రి పరిధిలోని ఎల్టీలు విధులకు హాజరవుతున్నప్పటికీ అటెండెన్స్ వేయలేదు. అధికారికంగా వీరు పనిచేయని కిందికే వస్తుంది. అయితే వీరికి వేతనాలు చెల్లిస్తారా.. లేదా అనేదానిపై స్పష్టత కరువైంది. ఇదిలా ఉండగా ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది ఎల్టీలను టర్మినెట్ చేశామని చెబుతున్నారు. అటెండెన్స్ లేదని, వారికి ఏవిధంగా వేతనాలు ఇస్తామని పేర్కొంటున్నారు. ఒకే ఆస్పత్రి పరిధిలో ఇలా ఇద్దరికి వేర్వేరు నిబంధనలు ఉండటంపై గందరగోళం నెలకొంది. కళాశాల పరిధిలోని అధికారులు, సిబ్బందిని ఈ విషయమై అడగగా, కొనసాగింపు ఉత్తర్వులు వచ్చేవరకు పనిచేస్తామని చెప్పడంతోనే కొనసాగించామని, జూలైలో కొనసాగింపు ఉత్తర్వులు రావడంతో వారికి వేతనాలు చెల్లించామని చెబుతున్నారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.


