కై లాస్‌నగర్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్‌ఎఫ్‌సీ) శాఖ మళ్లీ జిల్లాకు వస్తోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ కేంద్రంగా ఎంతో మంది వ్యాపారులకు ఆర్థికచేయూతనందించి పరిశ్రమల స్థాపనకు తోడ్పడింది. అయితే ఈ కా ర్యాలయాన్ని 2008లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాలకు తరలించారు. 18 ఏళ్లుగా జిల్లావాసులకు దూరమైన టీఎస్‌ఎఫ్‌సీ శాఖను మళ్లీ స్థానికంగాఅందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణంలోని జెడ్పీ సమీపంలో గల ఆ సంస్థ పాత కార్యాలయానికి ఆనుకుని సొంత భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పునరుద్ధరణకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో కా ర్యకలాపాలు అందుబాటులోకి వచ్చే అవకాఽశముందని ఆ సంస్థ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మహ్మద్ అలీం తెలిపారు.
జిల్లా అభివృద్ధికి దోహదం ..
ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఏళ్లుగా జిల్లాకు దూరమైన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ తిరిగి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఈ కార్యాలయం ఉన్నప్పటికీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాపారులు, ప్రజలకు సేవలందించేందుకు ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడి ప్రజలు కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటే వందలాది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. వాటిని దూరం చేసేలా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సంస్థ పారిఽశ్రామిక, సేవా రంగాల్లో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను మరింత వృద్ధి చేసేందుకు అవసరమైన రుణాలను అందజేయనుంది. హార్డ్‌వేర్, బట్టల దుకాణాలు , రైస్, కాటన్, జిన్నింగ్ మిల్లులు వంటి ఇతర వ్యాపారాలతో పాటు ఆసుపత్రులు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు వంటి వాటి ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేయనుంది. దీంతో జిల్లాలో ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. కొత్త పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వడం ద్వారా జిల్లా అభివృద్ధికి తోడ్పడనుంది.


