శాంతిఖని గని ప్రైవేటు..! | - | Sakshi
Sakshi News home page

శాంతిఖని గని ప్రైవేటు..!

Sep 2 2026 2:40 AM | Updated on Sep 2 2026 2:40 AM

● అప్పగింతకు సింగరేణి కంపెనీ ప్రయత్నాలు ● నష్టాలు తగ్గించుకునే యోచన ● కార్మిక వర్గంలో చర్చనీయాంశం

ఇతర గనులూ..

బెల్లంపల్లి: మందమర్రి ఏరియా పరిధిలోని బెల్లంపల్లి శాంతిఖని భూగర్భ గనిని ప్రైవేటుకు అప్పగించేందుకు సింగరేణి కంపెనీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బొగ్గు ఉత్పత్తి ద్వారా నష్టాలు వస్తుండడంతో తగ్గించుకునేందుకు ప్రయోగాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీ బొగ్గు ఉత్పత్తి చేసి ఇస్తే సింగరేణి కంపెనీ నిర్ణీత ధరకు విక్రయిస్తుంది. ఈ విధానంలో బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోల్‌ ఇండియా, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌లో ఈ విధానం అమలు చేసి నష్టాలను తగ్గించుకున్నట్లు గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేయడం, ఓ ప్రైవేటు కంపెనీ ఆసక్తి చూపడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నిలిచిన ఉత్పత్తి

శాంతిఖని భూగర్భ గనిలో దాదాపు తొమ్మిది నెలల నుంచి బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దాదాపు 550 మీటర్ల లోతులో నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. భూగర్భ భౌగోళిక స్థితిగతులు ప్రతికూలంగా ఉండి గాలి సరఫరా లేక కార్మికులు యాతన పడుతున్నారు. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి టన్నుకు రూ.21,550 వ్యయం అవుతుండగా.. అత్యల్ప ధర రూ.4,500కు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో టన్నుకు రూ.17,050 నష్టపోవాల్సి వస్తోందని కంపెనీ భావిస్తోంది. గనిలో 378మంది కార్మికులు పని చేస్తున్నారు. కొత్తగా సౌత్‌ సైడ్‌లో టన్నెల్‌ పనులు సాగుతుండడంతో మరో ఆరు నెలల వరకు బొగ్గు వెలికి తీసే అవకాశాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆస్ట్రేలియా ప్రతినిధుల సందర్శన

గనిని గత జూన్‌ 10న ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. భూగర్భంలో దిగి పని స్థలాలు, రక్షణ చర్యలు పరిశీలించారు. రెండు నెలల్లోగా నివేదిక అందిస్తామని ప్రకటించినా ఇప్పటికీ అందనట్లు తెలుస్తోంది.

అపారంగా బొగ్గు నిక్షేపాలు

1954లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా నేటికి 72ఏళ్ల కాలం గడిచిపోయింది. భూగర్భంలో ఇంకా తరగని నిక్షేపాలు ఉన్నాయి. దాదాపు 43 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు రెండున్నర దశాబ్దాల క్రితం సింగరేణి కంపెనీ బొగ్గు అన్వేషణ విభా గం అధికారులు సర్వే చేసి నిర్ధారించారు. అపారమైన నిల్వలు ఉన్న గనిలో ఉత్పత్తికి ఎదురవుతున్న సవాళ్లను ఛేదించుకుంటూ ముందుకు వెళ్లాలనే పట్టుదలతో యాజమాన్యం కార్యాచరణ తయారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే మరో 25ఏళ్ల వరకు బొగ్గు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి.

బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు ఉన్నాయి. బొగ్గు గనులు అంతరించడం, ఇతరత్రా కారణాలతో దశాబ్దంన్నర క్రితం రామకృష్ణాపూర్‌ ఏరియాను ఎత్తివేసి బెల్లంపల్లిలో ఉన్న జీఎం కార్యాలయాన్ని గోలేటి టౌన్‌షిప్‌(బెల్లంపల్లి పేరుతో)లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలో రెండు ఓపెన్‌కాస్టులు, భూగర్భ గనులు మూతపడ్డాయి. మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఓపెన్‌కాస్టు గనులతోపాటు భూగర్భ గనులు కూడా ఉన్నాయి. ఆయా ఏరియాల్లోని భూగర్భ గనులూ చాలావరకు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నోలాస్‌ నో ప్రాఫిట్‌లో ఉండగా, మరికొన్ని నష్టాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకోవాలనే నిర్ణయంతో సింగరేణి ప్రయోగాత్మకంగా ఎంచుకున్న శాంతిఖని గని అనుభవాలు మిగతా వాటిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement