మంచిర్యాలఅర్బన్: సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చే పేద విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం రవాణా చార్జీల నిధులను విడుదల చేసింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బడిలేని విద్యార్థులకు రవాణా, ఎస్కార్ట్ సౌకర్యం కోసం 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి మూడు నెలలకు (2026 జూన్ నుంచి ఆగస్టు వరకు) నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమీపంలో పాఠశాల లేక ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటర్, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వెళ్లే విద్యార్థులు ప్రయాణ భత్యాన్ని పొందేందుకు అర్హులు. ఒక్కో విద్యార్థికి పది నెలలకు రూ.6వేల చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తారు. ఇందుకు విద్యార్థి హాజరు 80 శాతం ఉండాలి. మూడు నెలల రవాణా చార్జీల మంజూరుతో విద్యార్థులకు ఊరటనిస్తోంది.
విద్యార్థుల ఖాతాలో నేరుగా..
ఉమ్మడి జిల్లాలో స్కూల్ లెస్ హబిటేషన్స్, విద్యార్థుల వివరాలను గుర్తించారు. దూరప్రాంతాలకు వెళ్లి రవాణా భత్యం పొందే వివరాలు లెక్కతేల్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,400 మంది విద్యార్థులకు రూ.61,20,000 రవాణా నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్‌లో పీఎస్, యూపీఎస్‌లో 231 మంది, హైస్కూల్‌లో 799 మందిని గుర్తించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో 92 మంది, ఉన్నత పాఠశాలలో 705 మంది, మంచిర్యాలలో పీఎస్‌లో 133 మంది, హైస్కూల్‌లో 575 మంది విద్యార్థులను గుర్తించారు. నిర్మల్ జిల్లాలో ప్రైమరీ, యూపీఎస్‌లో 39, ఉన్నత పాఠశాలల్లో 823 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించారు. వీరందరికి నెలకు రూ.600 చొప్పున మూడు నెలల నిధులు మంజూరయ్యాయి. వాటిని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు, మంజూరైన నిధులు (రూ.ల్లో)


