ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం సాగించిన యోధురాలు కుర్సెంగ రాధక్క, అలియాస్ మోతిబాయి అనారోగ్యంతో ఆసువులు బాసింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లింగుగూడకు చెందిన రాధక్క 20 ఏళ్ల వయసులోనే పోరుబాట పట్టింది. పోడు భూములకు హక్కులు కల్పించాలని, ఆదివాసీల అణచివేతపై విముక్తి కల్పించాలని పోరాటం సాగించింది. ఆమెను కడసారి చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. మావోయిస్టు మాజీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవుజీ నివాళులర్పించారు. రాధక్క భర్త చంద్రన్నను పరామర్శించారు. కుమురంభీం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్, తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు బండి ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్, వెంకటేష్, పౌర హక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎన్.నారాయణరావ్, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
నెరవేరని కల
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టిసావర్‌గాం శివారు ప్రాంతంలో గల కుమురం భీం గూడలో చిన్న ఇంటిని నిర్మించుకుని భర్త చంద్రన్నతో కలిసి నివాసం ఉండాలని భావించారు. కానీ ఆ కల నేరవేరకుండానే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం అందరికీ ఆవేదన మిగిల్చింది.


