కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(బి)గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న (63), గౌరాబాయి (70), తులసీరాం (27) సోమవారం మహారాష్ట్రలోని సాసర్‌కుండ్‌కు వెళ్లి వస్తుండగా తోటంబా వద్ద జీబు బోల్తాపడి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో పార్టి(బి) గ్రామం కన్నీటి పర్యంతమైంది. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాలను అప్పగించారు. నాలుగు చితులు వరుసక్రమంలో పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన జీబు, అందులో పరిమితికి మించి 9 మందికి బదులుగా 18 మందిని ఎక్కించుకుని ప్రయాణం చేయడం కూడా ఘటనకు కారణమైందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కాలం చెల్లిన వాహనాలపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.


