ఆదిలాబాద్‌రూరల్: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కఠోర శ్రమతో పాటు ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ వర్క్ ఎంతో ముఖ్యమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మెరిట్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు శిక్షణ తరగతుల ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టడీ సెంటర్‌లో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ అభిప్రాయాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు సిలబస్‌పై పూర్తి పట్టు సాధించాలన్నారు. స్టాటిక్ అంశాలను సమకాలీన పరిణామాలతో (కరెంట్ అఫైర్స్) అనుసంధానిస్తూ నోట్స్ తయారు చేసుకోవాలని, ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కు ఎంతో దోహదపడుతుందన్నారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో ఎలిమినేషన్ మెథడ్ కీలకమన్నారు. ప్రిపరేషన్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి బీసీ సంక్షేమాధికారి సునీతకుమారి, స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


