మహారాష్ట్రలో దైవ దర్శనానికి వెళ్లిన పార్డి(బి) గ్రామస్తులు
తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి బోల్తాపడిన జీపు
ఘటన స్థలంలో ముగ్గురు మృతి.. ఆస్పత్రిలో డ్రైవర్..
భైంసా/కుభీర్: శ్రావణ సోమవారం సందర్భంగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామానికి చెందిన పది మంది తీర్థయాత్ర విషాదాంతమైంది. పుణ్యక్షేత్రంలో దైవదర్శనం చేసుకుని, పూజలు చేసి.. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు మహారాష్ట్రలో తోటంబా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పార్డి(బి) గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న(63), తూము గౌరాబాయి(70)తోపాటు ఆవుల ప్రేమలబాయి, తూము ముత్తుబాయి, తూముల కిషన్, బ్యారపు మోనాజీ, దొర్లా శంకర్, పుష్ప భాయ్, దనగర్ మల్లయ్య, శంకర్ గ్రామానికే చెందిన తులసీరామ్(27)జీపులో సోమవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్రలోని కై లాస్‌టెకిడి శివాలయ దర్శనానికి బయల్దేరారు. మధ్యాహ్నం వరకు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో సాసర్ కుండ్ జలపాతం వద్దకు వెళ్లారు. తర్వాత స్వగ్రామానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు కుభీర్, భైంసా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చివరి ప్రయాణం..
తూము సాయిలు(60)–భార్య ముత్తుబాయితో కలి సి యాత్రకు వెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లు జరిపించారు. మలి వయసులో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాల్సిన దశలో ఆయన పుణ్య క్షేత్ర యాత్రలోనే మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో భార్య ముత్తుబాయి ప్రాణాలతో బయటపడింది. భర్తను కోల్పోయిన ఆమె ఏడుపు అక్కడున్న వారిని కలచివేసింది. ఇక ఆవుల గంగన్న(63)–ప్రేమలబాయి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో గంగన్న మృతి చెందాడు. ప్రేమలబాయి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరికీ వివాహం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన తూము గౌరాబా యి(70) భర్త మూడేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేసి కుటుంబంతో కలిసి మలిదశ జీవనం సాగిస్తోంది. గ్రామస్తులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆమెకు ఈ యాత్రే ఆఖరి ప్రయాణమైంది.
చెల్లాచెదురైన క్షతగాత్రులు..
ఘాట్ దిగుతుండగా జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జీపు టైరు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భీతావాహంగా మారింది. క్షతగాత్రుల రోదనలు విన్న సమీప గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలకు సమాచారం అందించారు.


