కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట
నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య వైరం
గల్లీ నుంచి గాంధీభవన్ దాకా నిరసనలు
ఉమ్మడి జిల్లాలో భగ్గుమంటున్న విభేదాలు
గాడిన పెట్టేవారే లేక కేడర్‌లో అయోమయం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పా ర్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి జిల్లా నాయకుల వరకు వారి మధ్య ఐక్యత కొరవడుతోంది. నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని శాసనసభ స్థానాలు గెలుచుకునేలా పని చేయాల్సి ఉండగా.. గ్రూపు రాజకీయాలతో కేడర్‌లో అయోమయం నెలకొంది.
గాంధీభవన్‌కు పంచాయితీలు
జిల్లా నుంచి పార్టీ పంచాయితీలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసేలా గాంధీభవన్ వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఉట్నూరులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ముందే ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలంటూ నరేశ్‌జాదవ్‌పై బోఽథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి అడె గజేందర్ తన అనుచరులతో గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా మాజీ డీసీసీ అఽధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు గాంధీభవన్ ముందే ధర్నా చేశారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ మధ్య సఖ్యత లేదు.
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బె ల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి వివేక్‌వెంకటస్వామి వర్గాలుగా ఉన్నా యి. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోనే మంతెన జగన్‌మోహన్‌రావు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు వ్యతిరేకంగా ఓ గ్రూపు కడుతున్నారు. అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామ, మండల స్థాయి నాయకులను కూడగడుతున్నారు. ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రి వివేక్ వర్గాల మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను నిరసిస్తూ దండేపల్లి మండలం గూడెంలో ఎమ్మెల్యే వర్గీయులు స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశా రు. దీనిపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఒకే పార్టీలో రెండు వేర్వేరు వర్గాలుగా ఉన్నాయి.
సరిదిద్దేవారేరి?
ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నారు. అయితే నాలుగు జిల్లాల్లో పరిస్థితులు చక్కబెట్టే వారే కరువయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం తక్కువగానే ఉంటోంది. దీంతో ఎవరికి వారే అన్నట్లు సాగుతోంది. ఓ వైపు ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదు. జిల్లా స్థాయిలో భర్తీ కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ఏం ఒరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని చక్కబెట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే అధిష్టానం ఆశలకు క్షేత్రస్థాయి నాయకుల మధ్య అనైక్యత అడ్డంకిగా మారాయి.


