సమ్మిళిత విద్యకు ‘ప్రశస్త్‌’ | - | Sakshi
Sakshi News home page

సమ్మిళిత విద్యకు ‘ప్రశస్త్‌’

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ప్రత్యేక అవసరాల విద్యార్థుల గుర్తింపు

స్కూళ్లలోనే డిజిటల్‌ స్క్రీనింగ్‌

మూడు విడతల్లో ప్రక్రియ

ప్రాథమికస్థాయి నుంచి ఇంటర్‌ వరకు

లోపాలున్న పిల్లలకు చికిత్స, సదరం సర్టిఫికెట్లు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. వివిధ రుగ్మతలతో అవస్థలకు గురవుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న వారిలో ప్రత్యేక అవసరాలున్న వారిని తొలి దశలోనే గుర్తించాలని భావించింది. ఈ మేరకు వారికి అవసరమైన విద్య, వైద్య, పునరావాస, సామాజిక సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రశస్త్‌’ యాప్‌ రూపొందించింది. జాతీయ విద్యా విధానం–2020, ఆర్‌పీడబ్ల్యూ 2016 చట్టం ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సాధారణ విద్యా వ్యవస్థలో సమాన భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమన్వయంతో విద్యార్థుల వివరాలను గుర్తించి నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది.

21 వైకల్యాల స్క్రీనింగ్‌..

ప్రతి విద్యార్థి సామర్థ్యాలతో పాటు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రారంభ దశలోనే గుర్తించడం ‘ప్రశస్త్‌’ ప్రధాన ఉద్దేశం. దృష్టి లోపం, వినికిడి, శారీరక, మేధో, అభ్యసన సమస్యలు ఇలా 21 వైకల్యాలను స్క్రీనింగ్‌ చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో విద్యార్థులకు ఉన్న సమస్యలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. రెండో విడతలో ప్రత్యేక విద్యా టీచర్లు, ఐఆర్‌పీలు గుర్తించిన విద్యార్థుల వద్దకు వెళ్లి మరోసారి స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం వైద్యుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందేలా చర్యలు చేపడతారు. ఆ తర్వాత వైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం సర్టిఫికెట్‌ అందజేసి ప్రభుత్వ పథకాలు, అవసరమైన పరికరాలు అందించేలా విద్యా శాఖాధికారులు చర్యలు చేపడతారు.

మూడు దశల్లో గుర్తింపు..

ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు ఏ విధంగా పరీక్షలు నిర్వహించేలానే అంశానికి సంబంధించి వీడియోలు పంపించారు. ఈనెల 31వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, రెసిడెన్షియల్స్‌, అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 30 వరకు వీడియోలు చూడాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 31 వరకు ప్రత్యేక విద్యాటీచర్లు, ఐఆర్‌పీలు విద్యార్థులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు.

తల్లిదండ్రులకు అవగాహన అవసరం..

తల్లిదండ్రులు తమ పిల్లల్లో కనిపించే సమస్యలను ఉపాధ్యాయులకు తెలియజేయాలి. నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే గుర్తించాలి. అయితే ఇదివరకు వైకల్యం లోపాలు ఉన్న పిల్లల్ని సదరం క్యాంప్‌నకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. శిబిరాల విషయంలో అవగాహన లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యేవారు. ఇక ఆ సమస్యకు చెక్‌ పడనుంది. పాఠశాల స్థాయిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

సమ్మిళిత విద్యకు బలమైన అడుగు

ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమానంగా పాఠశాల విద్యలో భాగస్వాములను చేయడమే సమ్మిళిత విద్య లక్ష్యం. ఇందుకోసం పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, సహాయక ఉపకరణాలు, అనుకూల బోధనా పద్ధతులు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈమేరకు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను గుర్తించిన అనంతరం వారి అర్హతకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు, విద్యా సదుపాయాలు, సహాయక ఉపకరణాలు, స్కాలర్‌షిప్‌ తదితర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటారు.

జిల్లాలో పాఠశాలలు 1461

అన్ని యాజమాన్యాల్లోని టీచర్లు 7349

ప్రత్యేక విద్య టీచర్లు 23

ఐఆర్‌పీలు 22

విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు

21 రకాల పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement