సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విమానాశ్రయంతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటుపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక సర్వే ప్రారంభమైంది. భూ సేకరణ గడువు ఈ ఏడాది డిసెంబర్ 31గా ఖరారు చేశారు. ఈ లోపు జాయింట్ యూ జర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు కోసం భూసేకరణతో పాటు అక్కడ భూమి అభివృద్ధి కోసం ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలి. ఇందుకు మరో నాలుగున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఈ టైమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా లక్ష్యం పూర్తి చేయాల్సిందే.
ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (జేయూఏ) ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కదులుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఎవియేషన్ ఎన్‌క్లేవ్, భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో వైమానిక శిక్షణ కేంద్రం ఆదిలాబాద్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత కాలంగా జరిగిన చర్చలు కొలిక్కి రావడం, భూసేకరణతో పాటు భూమి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2278.14 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఈ ఏడాది జూలై 25న జీవో ఎంఎస్ నం.36 జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రారంభమైన భూసర్వే..
జిల్లాకేంద్ర సమీపంలోని అనుకుంట గ్రామ శివారులో గల సర్వే నంబర్లు 16 నుంచి 31 వరకు ప్రాథమికంగా కొలతలు తీసుకోవడాన్ని సర్వే బృందాలు మొదలుపెట్టాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జి ల్లాలకు చెందిన సర్వేయర్లతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పడి సర్వేపనులు నిర్వహిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు మధ్య సర్వే కొలతలు పూర్తి చేస్తున్నారు. శాటిలైట్‌లో సూచించిన డిజైన్ ప్రకారం ఆయా భూములను బృందాలు పరిశీలిస్తున్నాయి. దానికి సంబంధించి ప్రాథమిక కొలతలు చేపడుతున్నారు.
ప్రణాళిక ఇలా..
రన్‌వే ప్రతిపాదన ఇలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఎయిర్‌బస్ 321 విమానాల ఆపరేషన్స్ కోసం 9వేల అడుగుల రన్‌వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేవలం చిన్న విమానాలే కాకుండా ఎయిర్‌బస్ 321 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు నడిచేలా అత్యాధునిక రన్‌వే, టర్మినల్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు.
నిర్వాసితుల డిమాండ్ ఇలా..
మరోవైపు భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు, నిర్వాసితులు తమకు మార్కెట్ ధరకు అనుగుణంగా న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్ కోసం నిధుల కేటాయింపులు..
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భూసేకరణ, విద్యు త్, నీరు, రహదారుల పరంగా ఆటంకాల తొలగింపుతో పాటు తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
వాటి వివరాలు..
భూసేకరణ వ్యయం
రూ.1,555.16 కోట్లు
హైటెన్షన్ (765 కేవీఏ) టవర్ల
తరలింపు : రూ.310 కోట్లు
వాగులు, కాలువల మళ్లింపు
రూ.57.49 కోట్లు
ఆదిలాబాద్–అనుకుంట రహదారి
మార్పు : రూ.35 కోట్లు
నిర్మాణాలకు నష్టపరిహారం
: రూ.31 కోట్లు
విద్యుత్, మిషన్ భగీరథ పైపులైన్ల
తరలింపు : రూ.22.31 కోట్లు


