కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల ఆర్థిక పరిపుష్టికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని ఆర్జించేలా పెరటి తోటల పెంపకం చేపట్టే దిశగా ప్రోత్సహిస్తోంది. అవసరమైన సీడ్‌ను ఉచితంగా అందజేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఈ వానాకాలం సీజన్‌కు గాను జిల్లా వ్యాప్తంగా 5వేల మంది మహిళా సభ్యులకు విత్తనాలు అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వారిని ఎంపిక చేసింది.
ఐదు రకాల విత్తనాలు..
గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు పండించేలా శ్రద్ధ వహిస్తోంది. ఇందుకు గాను ఒక్కో సభ్యురాలికి మిర్చి, బెండ, టమాట, పాలకూర, తోటకూర వంటి ఐదు రకాల విత్తనాలతో కూడిన కిట్‌లను ఉచితంగా అందజేస్తోంది. జిల్లాకు వంద కిట్‌లు కలిగి ఉన్న 50 బ్యాగుల్లో విత్తనాలను వ్యవసాయ శాఖ నుంచి సరఫరా చేసింది. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్న ఈ విత్తన కిట్‌లను మండల ఐకేపీ సిబ్బందికి అందజేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాలకు విత్తన కిట్‌లను పంపిణీ చేయగా మంగళవారం పూర్తిస్థాయిలో అందజేయనున్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. స్వతహాగా పండించుకున్న కూరగాయలు వంటకు వాడటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


