కై లాస్‌నగర్: సమాజంలో దళితులంటే చిన్నచూపు పోవాలంటే విద్య, రాజకీయ రంగాల్లో రాణించాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్‌లో సోమవారం నిర్వహించిన ఎస్సీ విభాగం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5లక్షల మంది దళితులు ఉన్నారన్నారు. బలం, బలగం ఉన్నా హక్కుల కోసం యాచించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కాలనే ఉద్దేశంతో ఎస్సీ సెల్ నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఎస్సీల్లోని 59 కులాల్లో అత్యధికంగా ఉన్న వారికే చైర్మన్ పదవులు కట్టబెడుతున్నట్లుగా తెలిపారు. దళితుల హక్కలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. అనంతరం ఎస్సీ విభాగం నూతన కమిటీలకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, పార్లమెంట్ అబ్జర్వర్ సిద్దార్థ్ హితాంబ్రే, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ శేఖర్, నాయకులు గజేందర్, సంజీవ్‌రెడ్డి, సాజిద్‌ఖాన్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


