రెండు నెలలైనా అందని యూనిఫాం
పాత దుస్తులతోనే విద్యార్థులు బడికి
13 మండలాలకు వచ్చిన వస్త్రం
షర్ట్ బట్టకు మాత్రం ఇంకా ఎదురుచూపులే
పంద్రాగస్టు వరకూ అనుమానమే!
ఆదిలాబాద్‌టౌన్: విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంకా యూనిఫాం అందలేదు. దీంతో వారికి నిరీక్షణ తప్పని పరిస్థితి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో విద్యార్థులు పాత యూనిఫాం, మరికొంత మంది రంగురంగుల దు స్తులతో బడికి హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన జూన్ నెలలోనే యూనిఫాం అందజేస్తోంది. ఈసారి కూడా బడులు తెరిచిన మొదటి రోజే యూనిఫాంతో పాటు షూ, బెల్టు అందిస్తామని ప్రకటించినా నేటికి వాటి జాడ కానరావడం లేదు. 13 మండలాలకు వస్త్రం వచ్చినా.. వాటిలో ప్యాంట్ బట్ట మాత్రమే ఉంది. షర్ట్ బట్ట ఎప్పుడు వస్తుందో తెలి యని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు స్వాతంత్య్ర దినో త్సవ సంబరా లకు పాత దుస్తులతోనే హాజరయ్యే దుస్థితి నెలకొంది.
చిరిగిన దుస్తులతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులే. గతేడాది ప్రభుత్వం రెండు జతల యూనిఫాంను పంపిణీ చేసింది. అయితే మొదట జూన్‌లో, ఆ తర్వాత కొన్ని నెలలకు మరో జత అందించింది. ప్రతిరోజు బడికి ఈ దుస్తులే ధరించడంతో చాలా మంది విద్యార్థులవి చిరిగిపోయాయి. వాటితోనే కొంతమంది పాఠశాలకు వస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు యూనిఫాం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు.
పంద్రాగస్టుకు పాత వాటితోనేనా..
విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాం అందకపోవడంతో పంద్రాగస్టుకు పాత బట్టలతోనే హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరం మళ్లీ కొత్త డ్రెస్‌ను పంపిణీ చేస్తోంది. థిక్ బ్లూ ప్యాంట్, లైట్‌బ్లూ షర్ట్ అందించనున్నారు. అయితే వీటిని కుట్టించే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే కొలతలు తీసుకున్నారు. ఒక్కో జతకు రూ.75 చొప్పున ప్రభుత్వం వారికి అందజేయనుంది. మెప్మా, డీఆర్‌డీఏ, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. అయితే కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లకు యూనిఫాం సరఫరా అయ్యింది. ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు అందలేదు. 13 మండలాలకు వచ్చిన వస్త్రం కూడా బల్క్‌గా వచ్చింది. వాటిని ఎమ్మార్సీ పాయింట్‌కు సరఫరా చేశారు. కట్ చేసి సంబంధిత మండలాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వారు ఎస్‌హెచ్‌జీలకు అందిస్తే ఆ పనులు ప్రారంభం అవుతాయి.
ప్యాంట్ సరే..
షర్ట్ బట్టేది
గతేడాది ఉన్న దుస్తులను ప్రభుత్వం మార్చింది. నీలిరంగు యూనిఫాం అందజేస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో వస్త్రం సరఫరా చేస్తే జూన్‌లో విద్యార్థులకు యూనిఫాం అందేది. రెండు, మూడు రోజుల క్రితం జిల్లాలోని 13 మండలాలకు ప్యాంట్ బట్ట వచ్చింది. ఇంకా షర్ట్ వస్త్రం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, తాంసి, తలమడుగు, నార్నూర్ మండలాలకు ఇంకా వస్త్రం చేరుకోలేదు.
ఎదురుచూస్తున్నాం..
ఈ విద్యా సంవత్సరంలో ఇంకా యూనిఫాం అందలేదు. గతేడాది ఇచ్చిన దుస్తులతో పా టు కలర్ డ్రెస్‌లో బడికి వస్తున్నాం. ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే బడులు ప్రారంభమై రెండు నెలలు గడిచింది. త్వరగా అందించాలి. – గంగోత్రి, పదోతరగతి
విద్యార్థిని, జెడ్పీఎస్‌ఎస్, మావల
ఆగస్టు 15 నాటికి సిద్ధం..
జిల్లాలోని 13 మండలా లకు సంబంధించి ప్యాంట్ వస్త్రం వచ్చింది. సంబంధిత పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం. ఆగస్టు 15 నాటికి వి ద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించేలా చర్యలు చేపడతాం. ఇప్పటికే కొలతలు తీసుకో వడం జరిగింది. ప్రక్రియను వేగవంతం చేస్తాం.
– ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి


