● ఎండిపోతున్న పంటలకు జీవం ● జిల్లాను కమ్మేసిన మేఘం ● ఏకధాటిగా వాన ● భారీ వర్షాలపైనే రైతుల ఆశలు
సాక్షి,ఆదిలాబాద్: హమ్మయ్య.. ఊరూరా చేసిన జలాభిషేకాలు, పూజలు ఫలించాయి. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. వర్షాభావంతో చేలల్లో వాడిన మొక్కలకు ప్రస్తుతం మళ్లీ జీవం వచ్చినట్లయింది. మరో 15 రోజులు వాన పడకున్నా ఏమి కాదన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు వాన కురుస్తూనే ఉంది. మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
తేలికపాటి వర్షం
జిల్లాలో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ముసురు మొదలైంది. ఏకధాటిగా కొనసాగుతుంది. జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాల్లో కురుస్తుండగా సామాన్యులతో పాటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు జీవం..
జిల్లాలో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న అత్యధి కంగా సాగుకాగా, వరి,జొన్న స్వల్పంగా సాగయ్యా యి. పత్తి 4లక్షల 23వేల 955 ఎకరాలు, సోయా 56,762, కందులు 42,701, మొక్కజొన్న 21,725 ఎకరాల్లో సాగయ్యాయి. రెండు వారాలుగా వరుణు డు ముఖం చాటేయడంతో మొలకెత్తిన పంటలు వాడిపోయాయి. మరికొద్ది రోజులు వర్షం కురువకపోతే ఎండిపోయి జీవం కోల్పోయే పరిస్థితి కనిపించింది. ఈ దశలో ముసురుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
ఇప్పుడు చేయాల్సింది..
వర్షాలు కురుస్తున్నందున ప్రస్తుతం ఎరువులు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. కలుపు నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా అనువైన గడ్డి మందులతో పాటు సస్యరక్షణ చ ర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కురుస్తున్న వర్ష పు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఫలితంగా భూమిలో తేమ శాతం పెరుగుతుందని, మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పంటలు తట్టుకునే వీలుంటుందని అభిప్రా య పడుతున్నారు.
ఇవి కూడా..
వర్షాభావం నేపథ్యంలో ఇప్పటివరకు పంట సాగు చేపట్టని రైతులు కందితో పాటు స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పత్తి,సోయా, కందిసాగు చేసి న రైతులు మొలకలు సరిగ్గా రాకపోతే ఆ గ్యాప్ ఫిల్ చేసుకునేందుకు మళ్లీవిత్తుకోవాలనిసూచిస్తున్నారు.
సాధారణం:
419.9
భారీ వర్షాలు పడితేనే..
జిల్లాలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 41 శాతం లోటు ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే దానిని పూరించే పరిస్థితులు ఉన్నాయి. రెండు మధ్య తరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగులో నీటి మట్టం, నీటి సామర్థ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. చెరువులు 50 శాతం కూడా నిండలేదు. భారీ వర్షాలు కురిసి వాగులు పారితే ఈ జలాశయాల్లో నీరు చేరే పరిస్థితి ఉంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహద పడతాయి.


