ఆదిలాబాద్‌టౌన్: జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. రహదారి భద్రత చర్యలపై మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులను నిర్దేశిత ప్రాంతాలు మినహా ఎక్కడా పార్కింగ్ చేయరాదని స్పష్టం చేశారు. రహదారులపై ఆక్రమణలు తొలగించి, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి జాతీయ రహదారులపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాలో ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ గుర్తించిన బ్లాక్‌స్పాట్ల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్.చిత్రు, రాజేశ్వర్, రవాణా శాఖ అధికారి కిశోర్ బాబు, డీఎంహెచ్‌వో సాధన, రోడ్లు భవనాల శాఖ, పోలీసు, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


